సన్యాసం స్వీకరించిన ఒకప్పటి అందాల హీరోయిన్ !

1990లలో బాలీవుడ్‌ను తన అందంతో మాయచేసిన హీరోయిన్ మమతా కులకర్ణి. ఇప్పుడు ఆమె సన్యాస మార్గాన్ని చేపట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకప్పుడు హిందీ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన మమతా.. కుర్రకారు గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ‘ప్రేమ శిఖరం, దొంగ పోలీస్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.
52 ఏళ్ల మమతా కులకర్ణి.. 2025 జనవరి 24న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నార్ అఖారాలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో.. ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి సమక్షంలో ఆమె ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సన్యాస జీవితాన్ని ప్రారంభించేందుకు మమతా సంప్రదాయ కాషాయ వస్త్రధారణలో కనిపించారు. మెడలో రుద్రాక్ష మాల, భుజానికి కుంకుమపువ్వు ధరించి, సాధ్విగా మారిన ఆమె పేరు కూడా మార్చుకున్నారు. ఇకపై ఆమెను మమతానంద్ గిరి సాధ్విగా పిలుస్తారు.
ఆమె సన్యాసం తీసుకున్న తర్వాత చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా, ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు గ్లామర్ ప్రపంచంలో మెరిసిన మమతా.. ఇప్పుడు తన జీవితాన్ని పూర్తిగా భగవంతునికి అర్పించింది.
మమతా మాట్లాడుతూ, “మహా కుంభమేళాలో సన్యాసం స్వీకరించడం నా జీవితంలో చిరస్మరణీయ క్షణం. ఇక్కడికి రావడం, ఈ మహోన్నత ఉత్సవాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం నా అదృష్టం” అని పేర్కొంది. గతంలో వివిధ వివాదాల్లో చిక్కుకున్న మమతా, ఇప్పుడు ఆత్మాన్వేషణ మార్గాన్ని ఎంచుకుని సన్యాసిని అయింది.
-
Home
-
Menu