‘ఖట్టా మీటా’ తర్వాత 15 ఏళ్ళకు మళ్లీ అక్షయ్, ప్రియదర్శన్ కాంబో !

‘ఖట్టా మీటా’ తర్వాత 15 ఏళ్ళకు మళ్లీ అక్షయ్, ప్రియదర్శన్ కాంబో !
X
హైదరాబాద్ షెడ్యూల్‌లో అక్షయ్ కుమార్, టబులపై ఓ క్లాసికల్ డాన్స్ నంబర్‌ను చిత్రీకరించారు.

ఖట్టామీటా తర్వాత 15 ఏళ్ళకు మళ్ళీ అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కలయికలో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుతోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు టబు కూడా నటిస్తోంది. పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్, అస్రాణి, వామికా గబ్బి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రధాన షెడ్యూల్‌ను చిత్రబృందం పూర్తి చేసుకోగా.. ఈ నెల్లోనే చివరి షెడ్యూల్ కోసం సిద్ధమవు తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్ షెడ్యూల్‌లో అక్షయ్ కుమార్, టబులపై ఓ క్లాసికల్ డాన్స్ నంబర్‌ను చిత్రీకరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ప్రీతమ్ స్వరపరిచిన ఈ పాటలో టబు పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించనుంది. అక్షయ్‌తో కలిసి ఆమె ఓ అద్భుతమైన క్లాసికల్ డ్యాన్స్ చేయబోతోందని, ఇది సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ‘భూత్ బంగ్లా’ సినిమాను పూర్తిగా వినోదాత్మకమైన హారర్ కామెడీగా మలిచారు. ఈ చిత్రంలో వామికా గబ్బి హీరోకి ప్రియురాలిగా.. మిథిలా పాల్కర్ అక్కగా కనిపించనున్నారు. ‘హేరా ఫేరీ’, ‘భాగం భాగ్’, ‘భూల్ భులయ్యా’ వంటి కల్ట్ కామెడీ చిత్రాల్లో నటించిన తారాగణం తిరిగి ఈ సినిమాకు జత కావడం విశేషం.

ఈ సినిమాను అత్యున్నత సాంకేతికతతో ప్రియదర్శన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందుకే ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్ విజువల్స్ పెద్ద ఎత్తున ఉండనున్నాయని.. సినిమా హాలీవుడ్ స్థాయిలో గ్రాండ్‌గా రూపొందుతోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ప్రీతమ్ పని చేస్తుండగా, గతంలో ‘భూల్ భులయ్య’ సినిమాలో అక్షయ్-ప్రియదర్శన్-ప్రీతమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అమీ జే తోమార్’ పాట ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఇప్పుడు అదే మ్యూజికల్ మ్యాజిక్ భూత్ బంగ్లాలో కూడా కనిపించనుందని అంచనాలు పెరిగాయి.

Tags

Next Story