ఆకట్టుకున్న అక్షయ్ కుమార్ వినూత్న ప్రయత్నం

ఆకట్టుకున్న  అక్షయ్ కుమార్ వినూత్న ప్రయత్నం
X
తాజాగా.. అక్షయ్ ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఓ థియేటర్‌కు మాస్క్ ధరించి వెళ్లారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను సమీపించి, “సినిమా ఎలా అనిపించింది?” అని స్వయంగా అడిగి వారి అభిప్రాయాలను విన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన సినిమాల ప్రమోషన్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు, వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడంలో ఆయన చూపే చొరవ సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. తాజాగా, తన కొత్త చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’ కోసం ఆయన చేసిన ఓ ప్రత్యేక ప్రయత్నం అభిమానుల మనసులను గెలుచుకుంది.

‘హౌస్‌ఫుల్ 5’లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించగా, అభిషేక్ బచ్చన్, రితేశ్ దేశ్‌ముఖ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, సోనమ్ బాజ్వా, నర్గీస్ ఫక్రీ, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్ లాంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో కనిపించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి తరుణ్ దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమాపై ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు అక్షయ్ ఒక వినూత్న ప్రయత్నం చేశారు.

తాజాగా.. అక్షయ్ ముంబయిలోని బాంద్రాలో ఉన్న ఓ థియేటర్‌కు మాస్క్ ధరించి వెళ్లారు. సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులను సమీపించి, “సినిమా ఎలా అనిపించింది?” అని స్వయంగా అడిగి వారి అభిప్రాయాలను విన్నారు. ఈ సందర్భంగా ఆయన గుర్తుపట్టబడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ ఆసక్తికర అనుభవాన్ని వీడియోగా తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు.

“‘హౌస్‌ఫుల్ 5’ చూసిన వారి నుంచి నేరుగా రివ్యూలు తెలుసుకోవాలనుకున్నాం. అందుకే కిల్లర్ మాస్క్‌లు ధరించి బాంద్రా థియేటర్‌కు వెళ్లాం. ప్రేక్షకులు నన్ను గుర్తించేలోపే అక్కడి నుంచి పరుగెత్తేశాం. నిజంగా అద్భుతమైన అనుభవం!” అని అక్షయ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అక్షయ్ ఈ వినూత్న ప్రయత్నం, ఆయన సినిమా పట్ల చూపిన అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

Tags

Next Story