మాస్ బీట్స్ మాంత్రికుడిగా ఎదుగుతున్న భీమ్స్!

మాస్ బీట్స్ మాంత్రికుడిగా ఎదుగుతున్న భీమ్స్!
X

టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలకు సంగీత దర్శకుడిగా నిలదొక్కుకోవడం ఓ సవాల్. ఈ రంగంలో దేవిశ్రీ ప్రసాద్‌, తమన్‌, అనిరుధ్‌లు సుప్రసిద్ధులు. అయితే, ఈ ముగ్గురు చుట్టూ తిరిగే ఈ గేమ్‌లో ఇప్పుడు భీమ్స్ అనే మ్యూజిక్ డైరెక్టర్ చోటు దక్కించుకుంటున్నాడు.

భీమ్స్ తన సంగీత ప్రయాణాన్ని చిన్న సినిమాలతో ప్రారంభించి, మాస్ బీట్‌లలో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ధమాకా సినిమాతో భీమ్స్‌కు భారీ హిట్ దక్కింది. ఆ సినిమాలోని పాటలు అన్నీ జనాల్లోకి బాగా వెళ్లాయి. ఈ చిత్రానికి పాటలే ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, ధమాకా విజయం తరువాత కూడా భీమ్స్ పెద్ద అవకాశాలు అందుకోలేకపోయాడు. ఇప్పుడు భీమ్స్‌కి మరో గొప్ప అవకాశం రూపంలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా లభించింది. ఈ చిత్రానికి భీమ్స్ మంచి పాటలను అందించాడు. ముఖ్యంగా "గోదారి గట్టు పైనా" పాట, చార్ట్‌బస్టర్‌గా మారి, ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ పాట ప్రచార కార్యక్రమాల్లో కూడా పెద్ద పాత్ర పోషించింది.

భీమ్స్ నేపథ్య సంగీతంలో తన ప్రత్యేకతను చూపించాడు. కొన్ని సన్నివేశాలకు తగినంత ఎమోషన్‌తో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం అతని ప్రధాన బలం. సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ చెప్పే "హాయ్" అనే పదానికి ఇవ్వబడిన స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ హిట్‌తో భీమ్స్ మ్యూజిక్ కెరీర్ కరెక్ట్ ట్రాక్ ఎక్కినట్టు అనిపిస్తోంది. యాక్షన్ డ్రామాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కూడా తాను సత్తా చాటితే, ఆయనకు మరిన్ని పెద్ద అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ఈమధ్య కాలంలో ఎలివేషన్ సీన్లకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో కీలకంగా మారింది. తమన్ ఈ రంగంలో ఆధిపత్యం చాటుతున్నాడు. భీమ్స్ కూడా ఈ విభాగంపై దృష్టి పెడితే, అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలుస్తాడు.

భీమ్స్‌కు మరో కీలక అవకాశంగా చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా కనిపిస్తోంది. ఈ చిత్రానికి భీమ్స్ సంగీత దర్శకుడిగా ఎంపికైనట్టు సమాచారం. చిరంజీవి సినిమాల్లో పాటల విషయంలో అంచనాలు ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటాయి. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు హార్ట్ టచింగ్ ట్యూన్స్ కావాలి. ఈ ప్రాజెక్ట్ భీమ్స్‌కు నిజమైన పరీక్ష. ఇక్కడ ఆయన విజయం సాధిస్తే, అతని కెరీర్‌ పూర్తి స్థాయిలో సెటిల్ అయిపోయినట్టే. భీమ్స్ మ్యూజిక్‌లో మెరుపులు చూపిస్తూ, మాస్ బీట్స్ మాంత్రికుడిగా ఎదగడం పక్కా.

Tags

Next Story