సైఫ్ అలీ ఖాన్‌పై దాడి.. విచారణ మొదలుపెట్టిన పోలీసులు!

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగిన ఘటన అభిమానులలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ముంబైలోని ఆయన నివాసంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి, అతడిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్ శరీరంపై ఆరు గాయాలు కాగా, రెండు గాయాలు తీవ్రమైనవిగా వైద్యులు పేర్కొన్నారు. మెడ, వెన్నెముకపై గాయాలు లోతుగా ఉన్నాయని, ప్రస్తుతం లీలావతి హాస్పిటల్‌లో సైఫ్‌కు శస్త్రచికిత్స జరుగుతోందని సమాచారం.
ముంబై పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సైఫ్ నివాసంలోని సిబ్బందిని విచారిస్తూ, దాడి వెనుక కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ద్వారా దాడికి పాల్పడిన వ్యక్తి కదలికలను గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుండగుడు ఇంట్లో చోరీ చేయడానికి ప్రయత్నించి, సైఫ్‌తో పెనుగులాటకు దిగాడు. ఈ తతంగంలోనే సైఫ్ గాయపడ్డాడని తెలుస్తోంది.
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో అభిమానులను ఓపికగా ఉండాలని కోరుతూ, సైఫ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభాస్ ‘ఆదిపురుష్‘, ఎన్టీఆర్ ‘దేవర‘ చిత్రాల్లో విలన్ గా నటించాడు సైఫ్ ఆలీ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటిస్తున్నాడు. సైఫ్ పై జరిగిన దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ చిరు, తారక్ ట్వీట్స్ చేశారు.
Tags
-
Home
-
Menu