అన్నపూర్ణ స్టూడియో.. 50 ఏళ్ల ఘన ప్రస్థానం!

అన్నపూర్ణ స్టూడియో.. 50 ఏళ్ల ఘన ప్రస్థానం!
X

తెలుగు సినిమా రంగం ఈ రోజు భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో నిలిచేంత స్థాయికి ఎదగడం వెనుక అసమాన కృషి, నాయకత్వం ఉందని అందరూ ఒప్పుకుంటారు. ఈ ప్రస్థానంలో అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్) పాత్ర అత్యంత కీలకమైంది. తెలుగు సినీ పరిశ్రమకు హోం గ్రౌండ్‌గా హైదరాబాద్‌ను మార్చిన ఘనత ఏఎన్నార్‌దే.



హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమను నెలకొల్పడం ద్వారా ఏఎన్నార్ తెలుగు చిత్రసీమ అభివృద్ధికి బాటలు వేసారు. అన్నపూర్ణ స్టూడియో, ఆ తర్వాత నిర్మితమైన రామోజీ ఫిల్మ్ సిటీ వంటి ప్రతిష్టాత్మక స్టూడియోలు తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి కారణమయ్యాయి.

1975లో ఏఎన్నార్ నిర్మించిన అన్నపూర్ణ స్టూడియో, తెలుగు సినిమా ఆర్థికాభివృద్ధికి, సాంకేతికంగా ఎదుగుదలకు కేంద్రబిందువుగా మారింది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్ వంటి కొండగుట్టల ప్రాంతంలో స్టూడియో నిర్మించడం ఆ కాలంలో అత్యంత సాహసోపేత నిర్ణయం. ఈ స్టూడియో నిర్మాణం కేవలం సినిమా చిత్రీకరణకు ఆవశ్యకమైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమను హైదరాబాద్‌కు స్థిరపరిచే ప్రధాన కారణంగా నిలిచింది.

అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు 50వ వార్షికోత్సవంలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబం ప్రత్యేక సంబరాలకు సిద్ధమైంది. నాగార్జున పంచుకున్న ప్రత్యేక వీడియోలో, తన తల్లిదండ్రులు స్టూడియో కోసం పడిన కష్టాలు, స్టూడియోలోని ప్రతి ప్రాంతాన్ని వారు ఎంతగా ప్రేమించారో తెలియజేశారు.

నాగార్జున మాట్లాడుతూ, అన్నపూర్ణ స్టూడియోలోని సిబ్బందిని తాము ఎప్పుడూ ఉద్యోగులుగా చూడలేదని, వారిని కుటుంబ సభ్యులుగా భావిస్తామని చెప్పారు. స్టూడియో ప్రారంభమైన సంక్రాంతి పండుగ రోజున ప్రతి సంవత్సరం సిబ్బందితో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఏఎన్నార్‌కు అలవాటుగా ఉండేదని, ఆ సంప్రదాయాన్ని తనూ కొనసాగిస్తున్నానని తెలిపారు.

Tags

Next Story