రెండు సార్లు ప్రమాదానికి గురైన అజిత్ కార్

తమిళ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం తన సొంత రేసింగ్ టీమ్ తరపున పోర్స్చే స్ప్రింట్ ఛాలెంజ్‌లో పాల్గొంటున్నాడు. స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన రౌండ్ 6 రేస్ సందర్భంగా.. అతడు రెండు సార్లు ప్రమాదానికి గురయ్యాడు. మొదటి ప్రమాదం జరిగిన తర్వాత.. అతడు తిరిగి తన కారును పిట్‌లోకి తీసుకెళ్లి రేస్ కొనసాగించాడు. అయితే, రెండో ప్రమాదంలో అతని కారు రెండు సార్లు మెలికలు తిరిగి పల్టీలు కొట్టింది. అయినప్పటికీ.. అజిత్ ఏమాత్రం గాయపడకుండా బయటపడటం విశేషం. చివరికి 14వ స్థానంలో రేసును ముగించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అజిత్ మేనేజర్ సురేశ్ చంద్ర తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో అజిత్ కారు ముందున్న మరో కారును ఢీకొని పల్టీలు కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పోస్ట్‌లో.. "వాలెన్సియాలో జరిగిన రౌండ్ 5 రేస్ అజిత్ కుమార్‌కు మంచి అనుభవం ఇచ్చింది. ఆయన 14వ స్థానంలో ముగించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అయితే, రౌండ్ 6లో ఆయన అనుకోకుండా రెండు సార్లు ప్రమాదానికి గురయ్యారు.
వీడియో చూస్తే అజిత్ తప్పు లేదని స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి ప్రమాదం జరిగిన తర్వాత కూడా, ఆయన రేస్ కొనసాగించారు. కానీ, రెండోసారి కారు పల్టీలు కొట్టడంతో రేసును పూర్తి చేయలేకపోయారు. అయినప్పటికీ, ఆయన ఎంతో ధైర్యంగా నిలబడి అభిమానులకు అభివాదం చేసి, ఫోటోల కోసం పోజులిచ్చారు. అజిత్ సురక్షితంగా ఉన్నారు. మీ అందరి ప్రార్థనలు, ఆశీస్సులకు ధన్యవాదాలు," అని పేర్కొన్నాడు.
ఈ వీడియో వైరల్ అవుతోంది. అజిత్ తరుచూ ప్రమాదాలకు గురవుతుండటంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భద్రత విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే, అజిత్ చివరగా మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించిన "విడాముయర్చి" చిత్రంలో కనిపించారు. ఆయన తదుపరి చిత్రం "గుడ్ బ్యాడ్ అగ్లీ", ఇది అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోంది. గత ఏడాది నుంచి అజిత్ తన నటనకు విరామం ఇచ్చి పూర్తిగా రేసింగ్‌పై దృష్టిపెట్టారు.
-
Home
-
Menu