దీపిక కు అరుదైన గౌరవం

ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకొనెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆమె 2026కి హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్‌కు ఎంపికయ్యింది. మోషన్ పిక్చర్స్ విభాగంలో ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటిగా దీపిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో డెమి మూర్, ఎమిలీ బ్లంట్, రాచెల్ మెక్ ఆడమ్స్ లాంటి ప్రముఖులతో పాటు దీపిక పేరు ఉండటం విశేషం.
2006లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దీపిక, 2017లో హాలీవుడ్‌లో ‘రిటర్న్ ఆఫ్ జెండర్ కేజ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి బాలీవుడ్ నుంచే కాక హాలీవుడ్‌లోనూ తన నటనతో మెప్పిస్తూ వస్తోంది. 2018లో టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో చోటు దక్కించుకోగా, 2022లో ఫిఫా వరల్డ్ కప్ ఆవిష్కరణలో పాల్గొంది. 2023లో జరిగిన అకాడమీ అవార్డ్స్ వేదికపై ‘నాటు నాటు’ పాటను పరిచయం చేసి ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకు గౌరవం తీసుకొచ్చింది.
ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందనున్న బహుభాషా చిత్రంలో దీపిక కథానాయికగా నటించింది. ఇంకా.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించే ‘కల్కి 2898 ఎ.డి’ సీక్వెల్‌లోనూ దీపిక నాయికగా కనిపించనుంది.
-
Home
-
Menu