విజయానికి కొత్త నిర్వచనం

విజయానికి కొత్త నిర్వచనం
X
తెలుగు సినిమా రంగంలో వారసత్వం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నాని ముందువరుసలో ఉంటాడు.

తెలుగు సినిమా రంగంలో వారసత్వం లేకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నాని ముందువరుసలో ఉంటాడు. 2008లో ‘అష్టా చమ్మా’తో అరంగేట్రం చేసిన అతను, మొదట్లో పక్కింటి అబ్బాయి తరహా పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతి త్వరలోనే తన నటనలో సహజత్వం, కథల ఎంపికలో చూపిన వివేకంతో మాస్, క్లాస్ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.

నాని కెరీర్‌లో విశేషంగా గమనించదగిన అంశం – స్టార్ డైరెక్టర్లపై కాకుండా యువ దర్శకులపై నమ్మకంతో ముందుకు వెళ్లడం. ఈ విషయంలో ఆయనకు వచ్చిన విజయాలు ఆయన కథలపై చూపిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ‘జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా’ వంటి చిత్రాలు ఆయన అభిరుచిని చాటుతూ, ప్రయోగాత్మకతకు నిదర్శనంగా నిలిచాయి.

తెలంగాణ మాస్ నేపథ్యంలో వచ్చిన ‘దసరా’ చిత్రం నానిని పాన్ ఇండియా స్టార్‌గా నిలిపింది. మాస్ లుక్, మాంచి నటన, భిన్నమైన బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసి నానిని మాస్ హీరోగా మార్చాయి. ఆ తర్వాత ‘హాయ్ నాన్న, సరిపోదా శనివారం’ చిత్రాలతో ఆయన నటనా పరిధిని మరింత విస్తరించాడు.

‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్ ద్వారా ‘అ!, హిట్’ వంటి ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించి, నాని కంటెంట్‌ మీద ఉన్న దృష్టిని నిర్మాణంలోనూ చూపించాడు. అదే వాల్ పోస్టర్ ద్వారా ఈ ఏడాది 'కోర్ట్'తో నిర్మాతగానూ.. ఇప్పుడు 'హిట్ 3'తో హీరోగా, నిర్మాతగానూ ఘన విజయాలు అందుకున్నాడు.

దాదాపు 40 సినిమాల కెరీర్‌.. అందులో 32 చిత్రాలు హీరోగా నటించాడు. వీటిలో 80%కు పైగా విజయవంతమైన సినిమాలు ఉండటం, ఒకవైపు కమర్షియల్ సక్సెస్, మరోవైపు కంటెంట్ పరంగా ప్రశంసలు అందుకోవడం — ఇవన్నీ నాని తన కృషి, కథల ఎంపిక, ప్రేక్షకుల అభిరుచిపై ఉన్న అవగాహనకు బెస్ట్ ఎగ్జాంఫుల్స్ గా చెప్పొచ్చు. మొత్తంగా నాని కథలతో మమేకమయ్యే నటుడు మాత్రమే కాదు — పరిశ్రమలో తనదైన మార్గాన్ని ఏర్పరచుకున్న ఓ నిజమైన నేచురల్ స్టార్.

Tags

Next Story