రావణుడిగా యష్ ‘రామాయణ’ చిత్రీకరణ ప్రారంభం !

రావణుడిగా యష్ ‘రామాయణ’ చిత్రీకరణ ప్రారంభం !
X

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా "రామాయణ" షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగానూ, సాయిపల్లవి సీతగానూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ స్టార్ యష్ రావణ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే "టాక్సిక్" సినిమా కోసం ముంబైలో ఉన్న యష్.. తాజాగా ‘రామాయణ’ చిత్రంలోని యుద్ధ దృశ్యాల చిత్రీకరణను ప్రారంభించారని సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. యష్ రెండు రోజుల కాస్ట్యూమ్ ట్రయల్స్ అనంతరం శుక్రవారం నుంచి షూటింగ్ ప్రారంభించారు.

ఈ సినిమా కొంత భాగాన్ని ముంబైలోని ఆక్సా బీచ్ వద్ద చిత్రీకరించనుండగా.. తదుపరి దశలో దహిసర్ స్టూడియోలో షూటింగ్ కొనసాగనుంది. అయితే, ఈ యుద్ధ ఘట్టాలకు రాముడి పాత్రధారి రణబీర్ కపూర్ హాజరుకావడం లేదు. రావణుని యుద్ధ నైపుణ్యాన్ని ప్రతిబింబించేలా యుద్ధ సన్నివేశాలు రూపొందు తున్నాయని టాక్. వీటిలో గ్రీన్ స్క్రీన్ టెక్నాలజీ, గ్రౌండ్ షాట్స్, భారీ స్థాయిలో వీఎఫ్ ఎక్స్ వర్క్ చేర్చనున్నారు. ఈ యుద్ధ ఘట్టాలు రాముడితో తలపడే సంధర్భం కాదని.. అందువల్ల ఈ దశలో రణబీర్ కపూర్ పాల్గొనడం లేదు. అయితే, ఇతర ప్రధాన పాత్రధారులు యష్‌తో కలిసి ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు.

"రామాయణ" చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానుంది. ఈ చిత్రంలో లారా దత్తా, సన్నీ డియోల్, ఇంద్రా కృష్ణ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రావణుడిగా యష్ పాత్ర ఎలా ఉండబోతుందో, ఆయన అభినయం ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags

Next Story