సొంత పార్టీ నేతలే వెన్నుపోటు

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్న ఈటల;

Update: 2025-07-19 13:33 GMT

బీజేపీ సీనియర్ నేత, ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్గాల్లో తనపై జరుగుతున్న కుట్రలపై తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన గత 2023 ఎన్నికల్లో జరిగిన పరిణామాలపై స్పష్టత ఇచ్చారు. తనను సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిచారని ఆవేదనతో వ్యాఖ్యానించారు.

హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు, తనకే చెందిన పార్టీ నేతలే అడ్డుపడ్డారని ఆయన ఆరోపించారు. అయినా ప్రజల విశ్వాసంతోనే ఎంపీగా గెలిచానని తెలిపారు. “నాకు పదవులంటే ప్రాధాన్యం లేదు. నా జీవితం అంతా ప్రజల కోసం. పార్టీ మారాలంటే పదవుల కోసమే అన్న మాటలను నేను ఎప్పటికీ అంగీకరించను,” అని స్పష్టం చేశారు.

ఇటీవలి కాలంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో ఈటల మధ్య విభేదాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. హుజూరాబాద్‌లో ఈటల రాజకీయ ప్రాభవానికి చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారని మీడియా రిపోర్ట్స్ చెబుతుండగా, ఈటల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

వ్యక్తులపై నేను ఆధారపడలేదు. పార్టీ, ప్రజలే నా బలం. మా కార్యకర్తలే నా వెన్నెముక. వారిని కూడా నాపట్ల తిరగబెడుతున్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో నా మీద, నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరి పేర్లను చెప్పను కానీ, దుశ్చర్యలు జరుగుతున్నాయన్నది వాస్తవం.

అలాగే బీఆర్ఎస్ నుంచి బయటకు రావడానికి చాలానే కారణాలున్నాయని తెలిపారు. కానీ తాను ఎప్పటికీ బిడియంతో వ్యవహరించలేదని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌గారికే కూడా తాను తన అభిప్రాయాలు మొహమాటం లేకుండాచెప్పానని గుర్తు చేశారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ప్రజల ఆత్మగౌరవమే గెలిచింది. నేను అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను. అదే తత్వంతో ఇప్పుడు కూడా పనిచేస్తున్నా. కానీ కొన్ని వర్గాలకు ఇది నచ్చడం లేదు. అయినా నేను నమ్మేది ఒక్కటే – ప్రజలే. నా కార్యకర్తలే నా బలం, అంటూ ఈటల తేల్చి చెప్పారు.



Tags:    

Similar News