మామిడి రైతులకు రూ.4 సబ్సిడీ – కష్టకాలంలో కూటమి ప్రభుత్వం అండ
ఆత్మహత్యలు ఆలోచించిన పరిస్థితిలో రైతులకు కొత్త ఆశ చిగురింపజేసిన ప్రభుత్వం;
కష్టకాలంలో మామిడి రైతులకు అండగా నిలిచి, వారిని ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల హృదయాలను గెలుచుకుంది. తోతాపూరి మామిడి పంట కోత దశలోనే టన్నుకు మద్దతు ధరను రూ.12,000గా నిర్ణయించి, ఇందులో రూ.8,000ను జ్యూస్ ఫ్యాక్టరీల ద్వారా, మిగతా రూ.4,000ను ప్రభుత్వం ప్రత్యక్షంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం మామిడి రైతులకు ఊరట కలిగించింది.
ఇక పలు పల్ప్ ఫ్యాక్టరీలు అనుసంధానంగా వ్యవహరిస్తూ, మామిడి దిగుబడి అధికంగా ఉన్న సందర్భంలో కిలో రూ.8కు బదులు రూ.2.5 నుండి రూ.3.5 వరకూ మాత్రమే చెల్లిస్తామని రైతులను గందరగోళానికి గురిచేశాయి. ఈ పరిస్థితుల్లో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామన్న ఆవేదనతో కొందరు ఆత్మహత్యే శరణ్యంగా భావించిన సమయంలో ప్రభుత్వం ప్రకటించిన రూ.4 సబ్సిడీ రైతులకు ఆశ జల్లు లాంటిదైందని పలువురు పేర్కొంటున్నారు.
ఈ చర్యకు రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీసుకున్న నిర్ణయాలు ఎంతో సహాయంగా నిలిచాయని కొనియాడుతున్నారు. రైతుల కష్టాలను గమనించి ప్రభుత్వంతోపాటు వ్యవసాయ శాఖ స్పందించిన తీరు అభినందనీయం. కష్టకాలంలో తమకు అండగా నిలిచినందుకు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.