కుప్పంలో మరో అమానవీయ ఘటన
మరోసారి చంద్రబాబు ఇలాకాలో మరో మహిళకు అవమానం – ప్రభుత్వానికి ప్రశ్నలు;
కుప్పం నియాజక పరిధిలో మరోసారి మహిళకు అవమానం జరిగింది.చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని తమ్మిగానిపల్లి గ్రామంలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన మరోసారి చోటుచేసుకుంది. గ్రామ భూవివాదాల నేపథ్యంలో గ్రామస్థులు ఓ వృద్ధ మహిళ అని కూడా చూడకుండా కరెంట్ స్తంభానికి కట్టేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపుతోంది.
ప్రస్తుతం ఆ ప్రాంతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందింది. ఈ ఘటన తెలియగానే సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పేదవారిపై జరుగుతున్న అకృత్యాలు, గ్రామస్థాయి రాజకీయాల ప్రభావం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివరాల్లోకి వెళితే, తమ్మిగానిపల్లిలో భూమి సంబంధిత వివాదం ఓ వృద్ధురాలిపై గ్రామస్థుల ఆగ్రహానికి కారణమైంది. దారుణంగా ఆమెను గ్రామంలోని కరెంట్ స్తంభానికి కట్టి ఉంచారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఘటనపై పోలీసుల స్పందన ఆలస్యంగా రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత వృద్ధురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అధికారులు సంఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ సంఘటన మరొకసారి గ్రామీణ ప్రాంతాల్లో న్యాయవ్యవస్థ లోపించింది అనే వాస్తవాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. మానవత్వం మరిచిపోయిన సమాజంలో ఎంతటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయో ఈ ఘటన మరోసారి నిరూపిస్తోంది.
ఇంతకు ముందు కూడా సాక్షాత్తు చంద్రబాబు ఇలాకాలో ఒక మహిళా అని కూడా చూడకుండా తన కన్న బిడ్డ కళ్ళ ముందే చెట్టుకి కట్టేసి కొట్టిన సంగతి మరచి పోకుండానే,ఇంకో సంఘటన జరగటం చట్టం మీద ప్రజలకు ఉన్న విశ్వాసం తగ్గిపోయే ప్రమాదం ఉంది.ప్రభుత్వం కూడా ఇలాంటి అఘాయిత్యాలు చేసేవారి పైన కఠిన చర్యలు అమలు అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలి.