ఈ వారం థియేటర్, ఓటీటీ చిత్రాలు
ఈ వారం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. వీటిలో కొన్ని థియేటర్లలో సందడి చేయబోతుండగా.. మరికొన్ని ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి.;
ఈ వారం తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు రెడీ అయ్యాయి. వీటిలో కొన్ని థియేటర్లలో సందడి చేయబోతుండగా.. మరికొన్ని ఓటీటీలోకి అందుబాటులోకి వస్తున్నాయి.
రేపు థియేటర్లలో వినోదాన్ని పంచడానికి సిద్ధమైన తెలుగు చిత్రాలలో ఆది సాయికుమార్ ‘షణ్ముఖ, సప్తగిరి ‘పెళ్లి కాని ప్రసాద్’ సినిమాలను ప్రముఖంగా చెప్పుకోవాలి. ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘షణ్ముఖ’. డివోషనల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో అవికా గోర్ కథానాయికగా అలరించనుంది. ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు. ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు ఆది సాయికుమార్.
కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన చిత్రం 'పెళ్లి కాని ప్రసాద్'. వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ‘మల్లీశ్వరి‘లోని పెళ్లి కాని ప్రసాద్ క్యారెక్టర్ టైటిల్ ను ఈ చిత్రానికి పెట్టారు. ‘మళ్లీశ్వరి‘ తర్వాత తెలుగు లోగిళ్లలో పెళ్లికాని మగవాళ్లను పెళ్లి కాని ప్రసాద్ లు అనడం కామన్ గా మారిపోయింది. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించగా ఈ సినిమాలో సప్తగిరి సరసన ప్రియాంక శర్మ నటించింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమ ఎస్.వి.సి ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండటం విశేషం.
రేపు విడుదలవుతున్న చిత్రాలలో ‘టుక్ టుక్‘ ఒకటి. ముగ్గురు పిల్లలు - ఓ స్కూటర్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందింది. రీసెంట్ గా 'కోర్ట్' మూవీతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్ ఆ హీరోల్లో ఒకడు. కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సుప్రీత్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంకా.. ‘అనగనగా ఆస్ట్రేలియాలో, ఆర్టిస్ట్’ వంటి చిత్రాలు రేపు ప్రేక్షకులను ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాయి.
మరోవైపు ఓటీటీలోనూ ఈరోజు నుంచే కొన్ని చిత్రాలు ఆడియన్స్ ను అలరించడానికి వచ్చేశాయి. ఆహా ఓటీటీ వేదికగా ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చింది 'బ్రహ్మ ఆనందం'. తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ తాత మనవళ్లుగా నటించిన సినిమా ఇది. 'మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద' వంటి హిట్ మూవీస్ తీసిన స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్.వి.ఎస్. నిఖిల్ దర్శకత్వంలో 'బ్రహ్మ ఆనందం' రూపొందింది.
తెలుగు బయోపిక్ మూవీ 'జితేందర్ రెడ్డి' కూడా ఈరోజు నుంచే ఈటీవి విన్ ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. ఈ మూవీలో రాకేష్ వర్రే, రియా సుమన్ హీరోహీరోయిన్లుగా నటించారు. జగిత్యాలకు చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా డైరెక్టర్ విరించి వర్మ ఈ సినిమాను రూపొందించాడు.
కుంచాక్కో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. ఈ ఏడాది ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగులో రీసెంట్ గా థియేటర్స్ లోకి వచ్చింది. ఇప్పుడు 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఈరోజు నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా పలు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది.