నిర్మాత నాగవంశీ ఫైర్!

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.;

By :  S D R
Update: 2025-04-01 07:08 GMT

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.55 కోట్ల కలెక్షన్ల మార్కును దాటేసింది. టోటల్ గా నాలుగు రోజుల్లోనే ‘మ్యాడ్ స్క్వేర్‘ దాదాపు అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని సితార ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మ్యాడ్ స్క్వేర్‘ సినిమాపై వచ్చిన రివ్యూలపై, ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లతో పాటు తమ భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికరమైన విషయాలను నాగవంశీ వెల్లడించారు.

'మ్యాడ్ స్క్వేర్' పై వచ్చిన మిక్స్డ్ రివ్యూల విషయంలో మండిపడిన నాగవంశీ, ‘కంటెంట్ లేదని అంటారు, సీక్వెల్ హైప్‌తో నడిచిందని అంటారు. కానీ ఇది 'బాహుబలి 2, పుష్ప 2, కేజీఎఫ్ 2' లా కాదు. మా కష్టం, మా సినిమాలపై ప్రజల ప్రేమే విజయానికి కారణం అని నాగవంశీ స్పష్టం చేశారు. రివ్యూలు అన్యాయంగా ఉంటే తన సినిమాలను బహిష్కరించాలన్నదే తన అభిప్రాయం అని ఆయన తెలిపారు.

కలెక్షన్లు ఫేక్ అని అనేవారు వస్తే, తన ఫోన్‌లోనే కలెక్షన్ల వివరాలు చూపించేందుకు సిద్ధమని సవాలు విసిరారు నాగవంశీ. ‘కలెక్షన్లు తక్కువ చూపించి, వెబ్‌సైట్లు తమ రివ్యూలను సమర్థించుకోవాలని చూస్తున్నాయి‘ అంటూ కొన్ని మీడియా వర్గాలపై విమర్శలు గుప్పించారు. ఓవర్సీస్ సెన్సార్ కాపీల ద్వారానే పైరసీ ఎక్కువవుతోందని, దీంతో డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ఇక సితార నుంచి రాబోయే భవిష్యత్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ నటిస్తున్న 'కింగ్‌డమ్' సినిమా ‘కేజీఎఫ్‘ స్థాయిలో ఉండబోతుందని చెప్పారు నాగవంశీ. ఈ చిత్రం మే 30న విడుదల కానుందని వెల్లడించారు. అలాగే, రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'మాస్ జాతర' సినిమా జూలైలో విడుదలవుతుందని తెలిపారు.

తమ హారిక అండ్ హాసిని నుంచి రాబోయే అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమాపై కూడా నాగవంశీ స్పందించారు. ‘ఈ సినిమా అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇది ఒక మైథలాజికల్ చిత్రం, సోషియో ఫాంటసీ కాదని‘ స్పష్టం చేశారు.

మొత్తానికి, తన సినిమాలను అర్థం చేసుకుని చూసే ప్రేక్షకులకే ప్రాధాన్యతనిచ్చే నాగవంశీ, రివ్యూల విషయంలో తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడిస్తూ, తన సినిమాలపై నమ్మకాన్ని చూపించారు.

Tags:    

Similar News