‘దేవర 2’పై ఎన్టీఆర్ క్లారిటీ!

సూపర్ హిట్ 'మ్యాడ్'కి సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' భారీ విజయాన్ని సాధించింది. ఇంకా థియేటర్లలో ఈ చిత్రం స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు.;

By :  S D R
Update: 2025-04-04 16:21 GMT

సూపర్ హిట్ 'మ్యాడ్'కి సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' భారీ విజయాన్ని సాధించింది. ఇంకా థియేటర్లలో ఈ చిత్రం స్ట్రాంగ్ రన్‌తో దూసుకెళ్తుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మ్యాడ్ స్క్వేర్' టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించారు తారక్.

నవ్వించగలగడం అరుదైన విషయం అని.. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ వరంతోనే ప్రేక్షకులను మెప్పించారని, సీక్వెల్‌ను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించడమంటే సాహసం అని తారక్ అన్నారు. విష్ణు లడ్డు పాత్రను అమోఘంగా పోషించారని, అతను ఇన్నోసెన్స్ లేకుంటే సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందో లేదో చెప్పలేమని ఎన్టీఆర్ అన్నారు. సంగీత్ శోభన్ గురించి మాట్లాడినప్పుడు ఆయన తండ్రి శోభన్ గారు గుర్తొచ్చారని, ఆయన ప్రతిభను మరిచిపోలేమని భావోద్వేగంతో చెప్పారు.

ఇక తన బావమరిది నార్నె నితిన్ గురించి తారక్ ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. 2011లో తనకు పెళ్లైన సమయంలో నార్నె నితిన్ చిన్నవాడని, అప్పట్లో తనతో పెద్దగా మాట్లాడేవాడు కాదని గుర్తుచేశారు. అయితే, తొలిసారిగా ధైర్యంగా తన దగ్గరకు వచ్చి 'బావా, నేను యాక్టర్ అవుతాను' అని చెప్పాడని తెలిపారు. అప్పుడు తాను 'నీ ఇష్టం, కానీ నా సపోర్ట్ ఉండదు' అని చెప్పినప్పటికీ, ఇప్పుడు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడని ఎన్టీఆర్ అన్నారు.

సునీల్ తిరిగి హాస్య నటుడిగా మెప్పించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అతని కామెడీ ఇప్పటికీ ప్రత్యేకమేనని కొనియాడారు. నాగవంశీ సహాయంతో సినిమా విజయవంతమైందని, త్వరలో తాము కలిసి ఓ సినిమా చేయబోతున్నామని తెలిపారు. అలాగే 'దేవర 2' ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు ఎన్టీఆర్.

Tags:    

Similar News