సంధ్య థియేటర్ ఘటనపై NHRC సీరియస్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) మరోసారి సీరియస్‌ అయింది. ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా డిసెంబర్‌ 4, 2024న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో జరిగిన ఈ విషాద సంఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.;

By :  S D R
Update: 2025-05-24 03:08 GMT

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) మరోసారి సీరియస్‌ అయింది. ‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో సందర్భంగా డిసెంబర్‌ 4, 2024న ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లో జరిగిన ఈ విషాద సంఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లిన విషయం తెలిసిందే.

ఈ ఘటనపై అడ్వకేట్‌ ఇమ్మనేని రామారావు చేసిన ఫిర్యాదుతో NHRC స్పందించి అప్పుడే పోలీసులకు నోటీసులు జారీ చేసింది. పోలీసుల ప్రకారం, అల్లు అర్జున్‌ వచ్చాకే తొక్కిసలాట జరిగింది. కానీ ప్రత్యేక షోకు అనుమతి ఇవ్వలేదని చెబుతూ, అల్లు అర్జున్‌ అక్కడికి ఎలా వచ్చారు? అని కమిషన్ ప్రశ్నించింది.

థియేటర్‌ దగ్గర భారీ డీజే సెటప్‌లు, బాణసంచా, అభిమానుల ఆరాటం జరిగితేనేం, పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఇది జరుగుతుంటే పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని NHRC ప్రశ్నించింది. పోలీసులు లాఠీచార్జ్ జరగలేదని నివేదికలో పేర్కొన్నా, అక్కడ ఉన్నవారు వేరే అభిప్రాయాలు చెప్పడాన్ని నొక్కి చెబుతూ, ఈ అంశంపైనా వివరణ కోరింది.

తల్లి రేవతి మరణించినప్పటి నుంచి తీవ్ర గాయాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినా, బ్రెయిన్‌ సమస్యలతో ఇంకా కోలుకోలేదు. తాజాగా ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని సిటీ సీపీ సీవీ ఆనంద్ కు నోటీసులు జారీ చేసింది NHRC. ఈ నోటీసులతో ఈ ఘటన దర్యాప్తు మరోసారి వేగం పుంజుకునే అవకాశముంది. ఇప్పటికే ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కాగా, ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. పోలీసుల పాత్ర, భద్రతా విఫలం, అనుమతి వ్యవహారాలపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News