కొత్త ఫిల్మ్ పాలసీ త్వరలోనే!
జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల నిర్ణయంపై రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు.;
జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్ల నిర్ణయంపై రాష్ట్ర సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ అంశంపై హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. విచారణ అనంతరం వాస్తవాలను ఆధారంగా చేసుకొని పరిశ్రమకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, సినీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, టికెట్ల రేట్ల పెంపు, షూటింగ్ అనుమతుల జారీ వంటి అంశాల్లో ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. త్వరలో కొత్త ఫిల్మ్ పాలసీ అమలులోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
జూన్ 12న పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు‘ విడుదల నేపథ్యంలో థియేటర్ల బంద్ ప్రకటన వెలువడడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి కారణాలేంటి, ఎవరు ప్రేరేపించారు అనే అంశాలపై విచారణ జరిపి స్పష్టత తీసుకురావాలని తెలిపారు. పరిశ్రమతో ప్రభుత్వానికి అనుకూల వాతావరణం కొనసాగుతుందన్నారు.