ఈ వారం అనువాద చిత్రాలదే హవా!
థియేటర్లలో వారం వారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.;
థియేటర్లలో వారం వారం కొత్త సినిమాల జాతర కొనసాగుతూనే ఉంది. ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో తెలుగు నుంచి '23, బైలింగ్వల్ గా 'లెవన్' సినిమాలు ఉండగా.. తమిళం నుంచి 'డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్', హాలీవుడ్ నుంచి 'మిషన్ ఇంపాజిబుల్.. ది ఫైనల్ రెకనింగ్' వస్తున్నాయి.
‘మల్లేశం, 8 AM మెట్రో‘ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కించిన చిత్రం '23'. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వరుసగా కంటెంట్ డ్రివెన్ మూవీస్ ను అందిస్తూ వస్తోన్న రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుండడం విశేషం. స్టూడియో 99 ఈ చిత్రాన్ని నిర్మించింది.
'23.. మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా' అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మూడు మారణహోమ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని రూపొందించాడు డైరెక్టర్. 1991లో జరిగిన చుండూరు హత్యాకాండ, 1993 చిలకలూరిపేట బస్సు దహనం ఘటన, 1997 జూబ్లీహిల్స్ కార్ బాంబ్ పేలుడు – ఈ మూడు సంఘటనలను కలిపి కథగా మలిచాడు డైరెక్టర్ రాజ్. తేజ, తన్మయి, ఝాన్సీ, పవోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నటించిన చిత్రం 'లెవన్'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని లోకేష్ అజ్లస్ తెరకెక్కించారు. రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్, రిత్విక, ఆడుకలం నరేన్, రవి వర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు. అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించిన 'లెవెన్' చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు.
తమిళ నటుడు సంతానం ప్రధాన పాత్రలో నటించిన కామెడీ హారర్ చిత్రం ‘డెవిల్స్ డబుల్ నెక్స్ట్ లెవెల్’. 2023లో వచ్చిన 'డీడీ రిటర్న్స్'కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఎస్. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గీతిక తివారి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, నిళల్ గళ్ రవి, మొట్ట రాజేంద్రన్, యాషిక ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. రేపు ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలకు ముస్తాబవుతుంది.
హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూయిజ్ సూపర్ హిట్ సిరీస్ 'మిషన్ ఇంపాజిబుల్'లో లేటెస్ట్ మూవీ 'మిషన్ ఇంపాజిబుల్.. ఫైనల్ రెకనింగ్'. 'మిషన్ ఇంపాజిబుల్' సినిమాలు అంటేనే ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ గుర్తుకొస్తాయి. ఈ సినిమాలో టామ్ క్రూయిజ్ స్వయంగా చేసిన ఎన్నో డేర్ డెవిల్ స్టంట్స్ ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. మే 17న 'మిషన్ ఇంపాజిబుల్.. ఫైనల్ రెకనింగ్' ఇంగ్లీష్ తో పాటు తెలుగులోనూ సందడి చేయబోతుంది.