జూన్ 14న గద్దర్ అవార్డులు
తెలంగాణలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో ప్రత్యేకంగా అవార్డులను ప్రారంభించడం విశేషం.;
తెలంగాణలో చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గణనీయమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, ప్రజాగాయకుడు గద్దర్ పేరుతో ప్రత్యేకంగా అవార్డులను ప్రారంభించడం విశేషం. తెలుగు చిత్రాలకే కాకుండా, ఉర్దూ సినిమాలకూ ప్రోత్సాహం అందించనున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ‘తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసిన గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వడం గర్వకారణం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త జవసత్వం కలిగిస్తుంది‘ అని అన్నారు.
ఈ అవార్డులు జూన్ 14న హెచ్‌ఐసీసీలో ఘనంగా నిర్వహించనున్నారు. కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేస్తున్నట్టు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. 14 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వం అందించే ఈ అవార్డుల ఎంపిక కోసం నటి జయసుధ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జ్యూరీని నియమించారు.
అవార్డుల కోసం మొత్తం 1248 నామినేషన్లు అందగా, వీటిలో 1172 వ్యక్తిగత కేటగిరీలో, 76 ఇతర విభాగాల్లో ఉన్నాయి. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎన్ని విమర్శలు వచ్చినా గద్దర్ పేరు మీదే అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.
పోప్ ఫ్రాన్సిస్ మరణం కారణంగా గద్దర్ అవార్డుల లోగో ఆవిష్కరణ తాత్కాలికంగా వాయిదా పడింది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరణ జరుగుతుందని ప్రకటించారు.