డిప్యూటీ సీఎం నుంచి వీర యోధుడిగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతుండగా, అతని సినిమా కెరీర్ కూడా ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన పవన్, మరోవైపు తన సినిమాల విషయంలోనూ స్పీడ్ పెంచాడు.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వేగంగా దూసుకుపోతుండగా, అతని సినిమా కెరీర్ కూడా ఇప్పుడు మరో కీలక మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన పవన్, మరోవైపు తన సినిమాల విషయంలోనూ స్పీడ్ పెంచాడు. ఈ క్రమంలో ఎంతో కాలంగా వాయిదాపడుతూ వచ్చిన భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ను రిలీజ్ కు రెడీ చేశాడు.
పవన్ కళ్యాణ్ ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితుల్లో రిలీజ్ అవుతున్న తొలి సినిమా కావడంతో ‘హరిహర వీరమల్లు’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇది కేవలం అభిమానుల్లోనే కాకుండా, మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఏరియా వారీగా హక్కుల అమ్మకాలపై పోటీ తీవ్రంగా ఉండగా, నైజాం మార్కెట్లో అయితే రేట్లు పెరిగిపోతున్నాయి.
ఇప్పటికే సితార ఎంటర్టైన్‌మెంట్ సంస్థ రేసులో ఉందనే వార్తలున్నా, తాజాగా మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూషన్ వింగ్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఈ పోటీలో నైజాం థియేట్రికల్ రైట్స్ ధర రూ.50 కోట్లు దాటవచ్చని ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పవన్ సినిమాలకు నైజాంలో ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో ఇది ఆశ్చర్యం కాదు.
మరోవైపు ప్రాజెక్ట్ ప్రారంభ సమయంలో ఈ చిత్రాన్ని రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ.. ఐదేళ్ల లాంగ్ ప్రొడక్షన్‌తో నిర్మాతలు వడ్డీల భారం మోయాల్సి వచ్చింది. దీంతో రూ.200 కోట్లు అయ్యిందనే ప్రచారం ఉంది. మొత్తంగా.. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ బిజినెస్ లలో పాజిటివ్ గానే దూసుకెళ్తున్న 'హరిహర వీరమల్లు' నిర్మాతలకు ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి. జూన్ 12న 'హరిహర వీరమల్లు' పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది.