సంక్షేమ పథకాలు రద్దు - హోమ్ మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
గంజాయి పై ఉక్కుపాదం.. గిరిజనులకు 2 కోట్ల పండ్ల మొక్కలు;
ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఇటీవల ఒక సంచలన ప్రకటన చేస్తూ రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరికీ సంక్షేమ పథకాలను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నదని వెల్లడించారు మరియు ఇటువంటి అకృత్యాలకు పాల్పడేవారు ఇకనైనా తమ ప్రవర్తనను మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తేనే యువత భవిష్యత్తు బాగుంటుందన్న సంకల్పంతో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆమె వివరించారు, గంజాయి కేసులో ఎవరు పట్టుబడితే వారికి ఇకపై ఏ సంక్షేమ పథకాలు వర్తించవని స్పష్టంగా పేర్కొన్నారు, అలాగే గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు
గతంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఇరవై వేల ఎకరాలలో గంజాయి సాగు జరగగా ప్రభుత్వం కృషితో ఏడాది వ్యవధిలో ఆ స్థాయిని తొంభై ఎకరాలకు పరిమితం చేయగలిగినట్లు మంత్రి అనిత వివరించారు. గిరిజన ప్రాంతాల్లో అక్రమ సాగును నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నదని అలాగే వారికి జీవనోపాధి కోసం పండ్ల మొక్కలు ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల కోసం రెండు కోట్ల పండ్ల మొక్కలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించినదని వెల్లడించారు అనిత.
గత ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా గంజాయి వ్యాపారంపై ఉక్కుపాదం మోపుతూ మొత్తం 831 కేసులు నమోదు చేసి 214 మందిని అరెస్టు చేసినట్టు మంత్రి చెప్పారు. అంతేగాకా పోలీసులు ఏడాది కాలంలో 23770 కిలోల గంజాయిని అలాగే 27 లీటర్ల హాశిష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారనీ తెలిపారు. గంజాయి రవాణాలో ఉపయోగించిన రెండువందల తొంభైమూడు వాహనాలను సీజ్ చేసినట్టు వెల్లడించారు హోమ్ మంత్రి. గంజాయి సాగును ప్రోత్సహించిన ఏడుగురికి చెందిన ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షల విలువైన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు అనిత.
ఇంకా ఆపరేషన్ గరుడ పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో మెడికల్ షాపులపై తనిఖీలు నిర్వహించి నూట యాభై మెడికల్ షాపులను మూసివేసినట్లు వంగలపూడి అనిత తెలిపారు.ఆపరేషన్ గరుడ పేరుతో రాష్ట్రంలో రైల్వే స్టేషన్ లోను,షాపులోనూ విస్తృత తనిఖీలు చేబడుతున్నట్టు తెలియచేసారు.