మామిడి రైతులకు కూటమి భరోసా – తోటపురి పంటకు కిలో రూ.12 మద్దతు ధర
రైతుల సంక్షేమాన్ని వ్యతిరేకించే జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణలు – APSAM వైస్ చైర్మన్ మండిపాటు;
మామిడి రైతులకు మద్దతు ధర కల్పించిన విషయమై అవగాహన లేకుండా జగన్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సంఘం (APSAM) వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో విస్తృతంగా సాగు చేసే తోతాపురి మామిడి పంటపై ముఖ్యంగా చర్చించామని తెలిపారు. ఈ పంట సుమారు 80,000 హెక్టార్లలో (దాదాపు 2 లక్షల ఎకరాల్లో) పండించబడుతుందన్నారు. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ప్రతి ఏడాది దిగుబడిలో వ్యత్యాసం ఉంటుందన్నారు. గత సంవత్సరం 2.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని, ఈ సంవత్సరం ఉద్యానవన శాఖ అంచనాల ప్రకారం 6.7 లక్షల టన్నులకు పైగా దిగుబడి రావచ్చన్నారు మర్రేరెడ్డి శ్రీనివాస్.
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని శ్రీ మర్రెడ్డి వివరించారు. తోతాపురి మామిడిని కిలో రూ.12కి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో రూ.8 ఫ్యాక్టరీలు చెల్లిస్తే, మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ ధర రైతులకు లాభదాయకంగా ఉండి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తుందన్నారు.ఈ చర్యలు జూన్ 9నుండే అమల్లోకి వచ్చాయని తెలిపారు
వైసీపీ నేత జగన్ రెడ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కర్ణాటకలో మామిడి కిలో రూ.16కు కొనుగోలు చేస్తున్నారని వైసీపీ ప్రచారం చేయడంపై, అది పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. కర్ణాటకలో మండీలలో కిలో రూ.2, ఫ్యాక్టరీలలో రూ.4 మాత్రమే ధర ఉందన్నారు. తప్పుడు సమాచారం ద్వారా రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు అవాస్తవాలను వ్యాపింపజేయడమేనని మర్రేరెడ్డి విమర్శించారు.
రైతులకు అవగాహన కల్పించేందుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో 27, తిరుపతిలో 6, అన్నమయ్యలో 1 పల్ప్ ఫ్యాక్టరీలను పరిశీలించి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు శ్రీనివాస్ రెడ్డి.