ధర్మవరంలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు
దేశ భద్రతకు విఘాతం కలిగించే పనుల్లో పాల్గొన్నారన్న అనుమానం - పాకిస్థాన్ ఉగ్రవాదులతో శిక్షణకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న నిందితులు;
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన నూర్ మహమ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దేశ భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాల్లో అతను పాల్గొన్నాడనే సమాచారంతో పోలీసులు చర్య తీసుకున్నారు. నూర్‌తో పాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఎస్పీ రత్న మాట్లాడుతూ, నిందితులు నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో సమాచారం పంచుకున్నారని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతోనే ఈ చర్యలు చేపట్టామని వివరించారు. అరెస్టు చేసిన వారిని కడప జైలుకు తరలించామని చెప్పారు.
నూర్ మహమ్మద్ బయటికి చూస్తే సాధారణ వ్యక్తిలా, చికెన్ బిర్యానీ అమ్ముకునే వ్యక్తిలా కనిపిస్తాడని ఎస్పీ అన్నారు. కానీ వాస్తవానికి మసీదు దగ్గర యువకులకు సమాచారం చేరవేస్తున్నాడని చెప్పారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా అతడిని అరెస్టు చేసినట్లు వివరించారు.
విచారణలో, నూర్ మహమ్మద్ ఉగ్రవాద శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అతను ఆరు నిషేధిత వాట్సప్ గ్రూపుల్లో, పాకిస్థాన్‌కి చెందిన మరో 30 వాట్సప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాడని వెల్లడించారు.ఇంకా ఇతర గ్రూపులతో సంబంధాలపై కూడా విచారణ కొనసాగిస్తామని ఎస్పీ రత్న అన్నారు.