ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై టీటీడీ అధికారికి సస్పెన్షన్
టీటీడీ విజిలెన్స్ నివేదికతో చర్య.. ఏఈఓ రాజశేఖర్ బాబు సస్పెండ్;
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీ ఏ. రాజశేఖర్ బాబును సస్పెండ్ చేశారు. ఆయన ప్రవర్తనపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి జిల్లా పుత్తూరులో నివసిస్తున్న రాజశేఖర్ బాబు ప్రతి ఆదివారం తన స్వగ్రామంలోని చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నట్టు సమాచారం. హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీలో ఉద్యోగిగా ఉండి, సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం, హిందూ సంస్థ ప్రతినిధిగా తన బాధ్యతలను పక్కనబెట్టి వ్యవహరించడం సరికాదని టీటీడీ భావించింది.
ఈ అంశంపై టీటీడీ విజిలెన్స్ విభాగం సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక సమర్పించింది. సంబంధిత ఆధారాలను పరిశీలించిన టీటీడీ అధికారులు శాఖపరమైన చర్యలతో పాటు, నిబంధనల ప్రకారం శ్రీ రాజశేఖర్ బాబును తక్షణమే సస్పెండ్ చేసినట్టు అధికారికంగా ప్రకటించారు.