శబ్ద కాలుష్యంపై తిరుపతి పోలీసుల ఉక్కుపాదం

మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా మారిన వాహనాలపై కఠిన చర్యలు;

Update: 2025-08-01 12:03 GMT

తిరుపతి నగరంలో అధిక శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., గారి ఆదేశాలతో ట్రాఫిక్ డీఎస్పీ నేతృత్వంలో ట్రాఫిక్ సీఐలు మరియు వారి సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ద్వారా, శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ, మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా అధిక శబ్దాన్ని విడుదల చేస్తున్న 60 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మరియు 500 సౌండ్ హారన్స్‌లను (ధ్వని పరికరాలు) నిర్వీర్యం చేశామని తెలిపారు. వీటిపై మోటార్ వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 190(2) ప్రకారం జరిమానాలు విధించారని వెల్లడించారు.

అధిక శబ్దాన్ని సృష్టించే ఈ పరికరాలను తొలగించి, వాటి స్థానంలో ఒరిజినల్ సైలెన్సర్లు అమర్చిన తర్వాత వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించారు. అదనంగా, శబ్ద కాలుష్యం వల్ల ఏర్పడే ఆరోగ్యపరమైన మరియు పర్యావరణపరమైన సమస్యలపై అవగాహన కలిగించేలా వాహన యజమానులకు కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు.

ఈ కౌన్సెలింగ్ ద్వారా చాలా మంది తమ పొరపాటును అర్థం చేసుకుని, స్వచ్ఛందంగా హారన్స్ మరియు సైలెన్సర్లను అప్పగించి నిర్వీర్యం చేయమనికోరారు. ఇప్పటివరకు మొత్తం 60 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లు మరియు 500 అధిక శబ్ద హారన్స్‌లపై జరిమానాలు విధించి, వాటిని నిర్వీర్యం చేసినట్టు ఎస్పీ గారు తెలిపారు.

శబ్ద కాలుష్యం నివారణకు ప్రతి ఒక్క మోటార్ వాహనదారుడు సహకరించాలని, తిరుపతి నగరాన్ని శబ్ద రహితంగా మార్చే లక్ష్యంతో ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు.

ఇంకా, ఈ అధిక శబ్ద హారన్స్‌లను అమర్చే మెకానికులపైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు. ప్రజల సహకారంతో తిరుపతి నగరాన్ని శాంతియుతమైన వాతావరణంతో శబ్ద కాలుష్యములేని నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతాయని తెలిపారు.

Tags:    

Similar News