టాటా గ్రూప్ మానవత్వం – ₹500 కోట్లు ట్రస్ట్

విమాన ప్రమాదం బాధితులకు దీర్ఘకాలిక మద్దతుగా టాటా సంక్షేమ ట్రస్ట్;

Update: 2025-07-19 03:06 GMT

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. ఈ దారుణ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోవడం భారత వాణిజ్య విమానయాన చరిత్రలోనే ఒక అత్యంత భయానక ఘట్టంగా నిలిచింది. ప్రయాణికులు, సిబ్బంది, వైద్య కళాశాల విద్యార్థుల సహా ఎన్నో కుటుంబాలు తీరని విషాదంలో మునిగిపోయాయి.

ఈ విషాదానికి స్పందనగా టాటా గ్రూప్, టాటా సన్స్, బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచాయి. ప్రమాదంలో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, వెంటనే అందించడమే కాకుండా, దీర్ఘకాలికంగా వారి సంక్షేమాన్ని గమనిస్తూ రూ.500 కోట్లతో ప్రత్యేక సంక్షేమ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో టాటా సన్స్, టాటా ట్రస్ట్‌లు కలిపి రూ.250 కోట్లు విరాళంగా అందించనున్నాయి.

ఈ ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు మాత్రమే కాకుండా, ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, వారి పిల్లల విద్య, కుటుంబ ఆరోగ్య సేవలు, జీవనోపాధి వంటి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డు ఈ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించనుంది.

ప్రమాదానికి సంబంధించి భారత విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ఇచ్చిన ప్రాథమిక నివేదిక ప్రకారం, పైలట్ల మధ్య జరిగిన సంభాషనలో అసాధారణతలు వెలుగులోకి వచ్చాయి. "ఆయిల్ స్విచ్ ఎందుకు ఆపేశావు?" అని ఒక పైలట్ ప్రశ్నించగా, "నేను ఆపలేదు" అనే సమాధానం ఇచ్చినట్లు రికార్డుల్లో ఉంది. తిరిగి స్విచ్ ఆన్ చేసేలోపే విమానం కుప్పకూలిపోయిందని నివేదిక పేర్కొంది. దీంతో పైలట్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తుది నివేదిక ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ఘోర ప్రమాదంలో బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్ ఇండియన్ ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేశ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అతడు విమానంలో 11A సీటులో ఉన్నాడు. భద్రతా బెల్ట్ వాడిన కారణంగా అతడు తక్కువ గాయాలతోే బయటపడినట్టు తెలుస్తోంది. అతడి అనుభవం ఈ విషాద ఘటనకు ఒక చిన్న ఆశాకిరణంలా మారింది.

ఇది కొత్త విషయం కాదు. టాటా గ్రూప్ గతంలో ముంబై 26/11 ఉగ్రదాడుల్లో కూడా తాజ్ హోటల్ సిబ్బందికి అండగా నిలిచింది. ఇప్పుడు అదే స్పూర్తితో ఈ విమాన ప్రమాద బాధితులకు సుదీర్ఘకాలికంగా మద్దతు ఇవ్వడం వారు సామాజిక బాధ్యతను ఎంతగా నెరవేర్చుతున్నారనే దానికి సాక్ష్యం.

Tags:    

Similar News