మహారాష్ట్ర పేలుడు కేసులో ఏడుగురుకి విముక్తి
ఓవైసీ తీవ్ర నిరసన – “బాధితులకి న్యాయం జరలేదని” ఆవేదన- సత్యమేవ జయతే” అంటున్న భాజపా;
2008లో మహారాష్ట్రలోని మాలెగాన్ పట్టణంలో జరిగిన బాంబు పేలుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు నిందితులను ముంబయిలోని ప్రత్యేక ఎన్‌ఐఏ(NIA) కోర్టు జూలై 31, 2025న నిర్దోషులుగా ప్రకటించింది. న్యాయస్థానం, నిందితులపై సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ వారి విడుదల చేసింది. విడుదల చేసిన వారిలో భాజపా ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ ఉన్నారు.
ఈ కేసులో ఆధారాలు సరైనవి లేకపోవడం, సాక్షుల ప్రవర్తన స్పష్టంగా ఉండకపోవడం కోర్టును ప్రభావితం చేశాయి. ప్రజ్ఞా ఠాకూర్ పేరిట ఉన్న మోటార్ సైకిల్ పేలుడుకు ఉపయోగించబడిందన్న ఆరోపణను కోర్టు సమర్థించలేదు. అలాగే, ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA) కింద ఉన్న ఆరోపణలు చట్టపరంగా సరైన ప్రక్రియలో నమోదు కాలేదని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఈ పేలుడు ఘటనలో 6 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది గాయపడ్డారు. దాదాపు 17 సంవత్సరాలుగా ఈ కేసు విచారణలో ఉంది. మొత్తం 323 మంది సాక్షులను కోర్టు విచారించగా, వారిలో 34 మంది తమ మొదటి చెప్పిన వాగ్మూలానికి వ్యతిరేకంగా స్పందించారు. ఈ కారణంగా అభియోగాల బలహీనతల వల్ల స్పష్టమై, తీర్పు నిందితుల అనుకూలంగా వచ్చింది.
AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఈ తీర్పుపై తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు బాధితులకి అన్యాయం జరిగింది అని, 6 మంది మరణించారు, వారి ప్రాణాలకి బాధ్యత వహించేది ఎవరు? దర్యాప్తు తప్పు దిశలో సాగింది. న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో అవిశ్వాసం పెరుగుతోంది, అని AIMIM అధినేత విమర్శించారు.
భాజపా వర్గాలు మాత్రం ఈ తీర్పును స్వాగతించాయి. ‘‘సత్యమేవ జయతే’’ అంటూ స్పందించాయి. కానీ, ముస్లిం సంఘాలు, బాధితుల కుటుంబాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది పూర్తిగా దర్యాప్తులో నిర్లక్ష్యం వల్ల జరిగింది,అంటూ బాధిత కుటుంబాలవారు ఆవేదన వ్యక్తం చేశారు. వారు త్వరలో హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఈ కేసులో కోర్టు కీలకంగా పేర్కొన్న విషయం ఏమిటంటే, ప్రభుత్వమే బాధితుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఇవ్వాలని చెప్పింది. అయితే, ఇది న్యాయంగా సరిపోతుందా అనే ప్రశ్న మాత్రం ప్రజల మదిలో మిగిలిపోయింది.
ఈ తీర్పు, భారతదేశ దర్యాప్తు వ్యవస్థపై, న్యాయవ్యవస్థపై అనేక సందేహాలు, చర్చలు కలిగిస్తోంది. 17 ఏళ్ల పాటు విచారణ జరిపిన తరువాత కూడా బాధితులకు న్యాయం అందలేదనే భావన పలు వర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పటికీ అసలు దోషులు ఎవరన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది.