కృష్ణా జిల్లా పేరుమార్పుపై వదంతులు
వంగవీటి రంగ పేరు పెట్టబోతున్నారని వార్తలు చర్చనీయాంశం అవుతున్నాయి,మరోవైపు కృష్ణా, గోదావరి పేర్లకు ఉన్న సాంస్కృతిక విలువలు కోల్పోతాయన్న ఆందోళనలో జిల్లావాసులు;
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో పేర్లు మార్చే అంశం కూడా చర్చనీయాంశమైంది. ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రభుత్వం ఒక క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది. ఇంకా తుది నివేదిక రాకముందే, తాజాగా "కృష్ణా జిల్లా పేరు వంగవీటి మోహనరంగ పేరుతో మార్చబోతున్నారు" అనే వార్తలు ఊపందుకున్నాయి.
ఈ వార్తతో రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది. అసలు ఈ ఆలోచన కొత్తది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, విజయవాడ చుట్టుపక్కల కొత్త జిల్లా ఏర్పాటుచేసి దానికి రంగ పేరు పెట్టాలన్న ప్రతిపాదన వచ్చింది. 2022లో కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నప్పుడు కూడా ఈ విషయం మళ్లీ వినిపించింది. కానీ ఆ సమయంలో అమలు కాలేదు. ఇప్పుడు మళ్లీ అదే చర్చ మొదలవ్వడంతో ప్రజల్లో అనుమానాలు పెరిగాయి.
వార్తల ప్రకారం జిల్లాకు "వంగవీటి మోహనరంగ కృష్ణా జిల్లా" లేదా కేవలం "వంగవీటి జిల్లా" అనే పేరు పెట్టే ఆలోచన ఉందట. కృష్ణా జిల్లాలో కామ్మ, కాపు రెండు వర్గాలూ బలంగా ఉండటంతో ఈ అంశం రాజకీయ, సామాజికంగా సున్నితమైనదిగా మారింది. గతంలో ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుతో ఒక జిల్లాను ఏర్పాటు చేసింది. అందుకే రంగా కూడా ఇలాంటి గౌరవం పొందాలని ఆయన అనుచరులు వాదిస్తున్నారు.
అయితే మరోవైపు చాలామంది "కృష్ణా" అనే పేరు ప్రజల జీవితాల్లో ఒక ప్రత్యేక గుర్తింపుగా ఉందని చెబుతున్నారు. కృష్ణా, గోదావరి నదులు తెలుగు వారితో అనుబంధమై ఉన్నాయనేది వారి వాదన. అలాంటి పేర్లు మార్చడం వల్ల భావోద్వేగాలు దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు నిజం కాకపోయినా, అవి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. కాపు వర్గం ఆశలు వమ్మైతే అసంతృప్తి పెరగొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి, అనవసర వదంతులను ఆపడం మంచిదని ప్రజలు సూచిస్తున్నారు.