జనసేనకు తెలంగాణలో కొత్త ఊపు?

పవన్ కల్యాణ్‌పై నమ్మకంతో ముందుకు సాగుతున్న తెలంగాణ నేతలు,టీఎస్ నేతలకు ప్రత్యేక ఆహ్వానాలు తెలంగాణ భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్న పవన్;

Update: 2025-08-25 12:48 GMT

టాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ప్రస్తుతం ఎక్కువగా ఏపీలోనే చురుకుగా ఉంది. మొదట్లో రెండు రాష్ట్రాల్లో పార్టీని బలంగా నడిపించాలని ప్లాన్ చేసినా… తర్వాత పరిస్థితులు మారడంతో తెలంగాణలో కార్యకలాపాలు కొంత తగ్గిపోయాయి. అయినా పవన్‌ను నమ్ముకుని ముందుకు వచ్చిన తెలంగాణ జనసేన నేతలు ఇప్పటికీ పార్టీతోనే కొనసాగుతున్నారు.

తాజాగా విశాఖపట్నంలో “సేనతో సేనాని” పేరిట మూడు రోజుల భారీ సమావేశం జరగబోతోంది. ఈ కార్యక్రమం తర్వాత తెలంగాణలో కూడా పార్టీ కార్యకలాపాలు కొత్త ఊపుతో మొదలవుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సాధారణంగా జనసేన పెద్ద కార్యక్రమాలు జరిగితే ఏపీలోని కేడర్ మాత్రమే కాకుండా, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారు. అలాగే కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్రల నుంచి కూడా అభిమానులు వస్తుంటారు. ఈసారి ప్రత్యేకంగా తెలంగాణ నేతలకు ఆహ్వానాలు పంపడంతో, అక్కడి నాయకులు సమావేశాలకు హాజరై భవిష్యత్ వ్యూహాలపై చర్చించడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సమావేశం మొత్తం పవన్ కల్యాణ్ స్వయంగా హాజరవుతారు. మూడు రోజులూ కేడర్‌తో కలిసే ఉంటారు. చివరి రోజు బహిరంగ సభలో తెలంగాణలో పార్టీ విస్తరణ, భవిష్యత్ లక్ష్యాలపై పవన్ స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అంతకు ముందు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుని వ్యూహాలను సిద్ధం చేస్తారని సమాచారం.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ రోజురోజుకీ బలహీనపడుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన చాలామంది కీలక నేతలు వైదొలిగారు. ఇంకా కొంతమంది కూడా పార్టీని విడిచిపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. 2028 ఎన్నికల నాటికి బీఆర్ఎస్ మరింతగా క్షీణించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక మరోవైపు రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన, తెలంగాణలో కొంత బలంగా నిలబడగలిగితే… భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో, “సేనతో సేనాని” సమావేశం తర్వాత తెలంగాణలో జనసేన విస్తరణ ఖాయమని చెప్పొచ్చు.

Tags:    

Similar News