శ్రీశైలం పరిధిలోని గ్రామాల పేరు మార్పు
ఈగల పెంట ఇక నుండి ‘కృష్ణగిరి’, దోమల పెంట ‘బ్రహ్మగిరి’: శ్రీశైలానికి సమీప గ్రామాల పేర్లకు కొత్త రూపు;
శ్రీశైలం మండలం పరిధిలోని ప్రముఖ గ్రామాలైన ఈగల పెంట మరియు దోమల పెంట పేర్లను ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఈ మేరకు సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు.ఈగల పెంట గ్రామానికి కృష్ణగిరి అని, దోమల పెంట గ్రామానికి బ్రహ్మగిరి అని పేర్లు మార్చారు.
ఈ మార్పుల నేపథ్యంలో గ్రామాల పరిపాలనా వ్యవస్థల నుండి విద్యా సంస్థల దాకా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో బోర్డులు, రికార్డులు, నామపత్రికలు కొత్త పేర్లతో ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్.
కొన్ని గ్రామాలలో పేర్లు ఇప్పుడున్న నాగరికతను బట్టి ఆ ఊరు పేరు చెప్పడానికి కూడా కొంత మంది అవమానంగా భావించవచ్చు. ప్రజల గౌరవాన్ని పెంచేలా కొత్త పేర్లను నిర్ణయించడం వల్ల గ్రామాల గుర్తింపు మరింత గౌరవప్రదంగా ఉంటుంది.
'కృష్ణగిరి', 'బ్రహ్మగిరి' అనే పేర్లలో భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పౌరాణికత ఉంది. ఇవి ఆ ప్రాంతపు దేవతారాధన, మతపరమైన గుర్తింపుతో అనుసంధానం కలిగి ఉన్నాయి. శ్రీశైలం ప్రాంతం పవిత్రమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ నేపథ్యంలో గ్రామాల పేర్లను కూడా ఆధ్యాత్మికతతో అనుసంధానం చేసే దిశగా ఈ మార్పులు జరగటం అభినంద నీయం.
ఇప్పుడు ఈ కొత్త పేర్లు మార్పు వల్ల గ్రామీణ అభివృద్ధి శాఖలతో పాటు, విద్యా, ఆరోగ్య, రవాణా శాఖలన్నీ కొత్త పేర్లను తమ అధికారిక కాగితాల్లో, డేటాబేసుల్లో ఉపయోగించాల్సి ఉంటుంది.గ్రామ పంచాయితీలు, స్థానిక నాయకత్వం కూడా ప్రజలకు ఈ మార్పును గురించి అవగాహన కల్పించాలి.రేషన్ కార్డులు, ఆదార్, ఓటరు ఐడీ వంటి వ్యక్తిగత పత్రాల్లో మార్పులు సులభతరం చేసేందుకు ప్రత్యేక డ్రైవులు నిర్వహించే అవకాశంకల్పించాలి.
ఈ మార్పులపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, మరికొందరు తమ గ్రామ పాత పేరు మీదనే గర్వం ఉందని అంటున్నారు. అయితే, సమయానుగుణంగా ఈ పేర్ల మార్పులు గ్రామాల గుర్తింపును, గౌరవాన్ని పెంచే దిశగా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు.
పేర్ల మార్పు ఒక చిన్న చర్యలా కనిపించినా, దాని ప్రభావం సమాజంపై, మన ఆత్మగౌరవంపై, భవిష్యత్తు తరం గుర్తింపుపై చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీశైలం వంటి పవిత్ర ప్రాంతంలో ఈ మార్పులు సానుకూలంగా తీసుకోబడతాయని ఆశిద్దాం.