శ్వాస సమస్యలతో ముద్రగడకు అస్వస్థత

ముద్రగడ కుమార్తె క్రాంతిని చూడటానికి అనుమతించని కుమారుడు గిరిబాబు;

Update: 2025-07-20 13:06 GMT

కాపు ఉద్యమానికి నడుంకట్టిన నేత, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కాకినాడలోని మెడికవర్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో శనివారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదటగా కాకినాడ అహోబిలం ఆస్పత్రికి తరలించిన వైద్య బృందం, మెరుగైన చికిత్స కోసం ఆయనను అదే రాత్రి 10:30 గంటల సమయంలో మెడికవర్ ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం ముద్రగడకు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. శ్వాసతీవ్రత తగ్గించే ప్రయత్నంలో వైద్యులు నిష్ణాతులైన బృందంతో పనిచేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలియజేశారు.

ముద్రగడను చూడటానికి వచ్చిన కుమార్తె క్రాంతిని ఆస్పత్రి సిబ్బంది అనుమతించడంతో, ముద్రగడ కుమారుడు గిరిబాబు తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. సిబ్బందిపై ఘాటుగా స్పందించిన ఆయన,తండ్రిని చూడటానికి కుమార్తె క్రాంతిని అయన నిరాకరించారు.

ముద్రగడ ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారు. ముద్రగడ కుమారుడు గిరిబాబుతో ఫోన్‌లో మాట్లాడిన జగన్, అవసరమైతే ముద్రగడను ఎయిర్‌లిఫ్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించేందుకు తన తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్సార్‌సీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, వంగా గీతా ఆసుపత్రికి వెళ్లి ముద్రగడను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున అవసరమైన అన్ని సహాయాలను అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

ముద్రగడ పద్మనాభం ఆరోగ్యంపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కాపు సమాజానికి అత్యంత కీలకమైన నాయకుడిగా పేరు పొందిన ఆయన త్వరగా కోలుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు ప్రార్థిస్తున్నారు. వైద్యులు ఇప్పటికీ పర్యవేక్షణ కొనసాగిస్తుండగా, తదుపరి వైద్య చర్యలపై కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు చర్చిస్తున్నారు.

Tags:    

Similar News