3,500 కోట్ల మద్యం స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

A41 ఎవరు? మద్యం స్కాంలో జగన్ పేరు తెరపైకి – రాజకీయంగా పెనుదుమారం;

Update: 2025-07-19 17:16 GMT

ఆంధ్రప్రదేశ్‌ను ఉలిక్కిపడేస్తున్న 3,500 కోట్ల రూపాయల మద్యం స్కాంలో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్ ) అరెస్ట్ చేసింది.

మద్యం కుంభకోణంలో ఇప్పటికే పదకొండు మంది నిందితులను అరెస్ట్ చేసిన సిట్, మిథున్ రెడ్డిని 12వ నిందితుడిగా అరెస్ట్ చేసింది. ఇది ఈ కేసులో తొలి హైప్రొఫైల్ అరెస్ట్ కావడం గమనార్హం.

మొదట హైకోర్టులో, అనంతరం సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి అరెస్ట్ నివారణకు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. అనేక నాటకీయ పరిణామాల మధ్య మిథున్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు.విజయవాడలో సిట్ ఎదుట హాజరైన మిథున్ రెడ్డిని అధికారులు సుమారు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తరువాత ఆయనను అరెస్ట్ చేశారు.

ఈరోజు సిట్ ప్రాథమిక చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌లో మొత్తం 41 మంది నిందితుల పేర్లు ఉండగా, A41 ఖాళీగా ఉంచారు. ఇది రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే ఆ స్థానం పొందబోతున్నారా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఈ స్థాయిలో ఉన్న ఎంపీని అరెస్ట్ చేయడం అంటే సిట్ బృందానికి ఆయనపై పక్కా ఆధారాలు ఉండకపోతే సాధ్యం కాదు. అటువంటి ఆధారాలుంటే, ఈ కేసు అక్కడితో ఆగబోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జగన్‌కు పక్కా సమాచారం లేకుండా ఇంత భారీ స్కామ్ జరగడం అసాధ్యం అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక మరోవైపు, మాజీ మద్యం శాఖ మంత్రి నారాయణ స్వామికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఆయన జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది.

ఇక మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పేరు కూడా నిందితుల జాబితాలో ఉన్నా, ఆయనను అప్రూవర్ గా ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పట్ల ఆయన దూరంగా వెళ్తున్నట్టు సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి.

ఈ కేసు జగన్‌కు పెను సమస్యగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో పెను కలకలం సృష్టిస్తున్న ఈ మద్యం స్కాంలో వచ్చే రోజుల్లో మరిన్ని సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News