2026లో మేడారం జాతర తేదీలు ఖరారు - లక్షలాది భక్తులకి మేడారం పిలుపు
ములుగు మేడారంలో జనవరి 28 నుంచి సమ్మక్క సారలమ్మ పండుగ,విదేశాల నుంచీ భక్తుల రాకతో ములుగు మేడారం జాతర అంతర్జాతీయం;
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే "సమ్మక్క సారలమ్మ" మహా జాతర 2026 సంవత్సరానికి సంబంధించిన తేదీలను పూజారుల సంఘం అధికారికంగా ప్రకటించింది.
వచ్చే జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు ఈ పవిత్ర జాతర జరగనుంది. జాతర క్రమంగా జరిగే ముఖ్య ఘట్టాలు ఈ విధంగా వివరించారు. జనవరి 28, 2026 (బుధవారం) సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు దేవతలను గద్దెలపై ప్రతిష్ఠిస్తారు,జనవరి 29, 2026 (గురువారం) సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుని భక్తుల దర్శనార్థం వెలిసే పవిత్ర ఘడియ.జనవరి 30, 2026 (శుక్రవారం) భక్తులు తమ మొక్కులు చెల్లించుకునే రోజు. లక్షలాది మంది భక్తులు ఈరోజు ప్రత్యేకంగా తలచుకుని తమ మొక్కుబడులను సమర్పిస్తారు.జనవరి 31, 2026 (శనివారం) అమ్మవార్ల వనప్రవేశం కార్యక్రమం జరగనుంది. ఇది జాతర ముగింపు వేడుకగా భావిస్తారు.
ఈ జాతరకు దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. తల్లుల గాధను, వీరత్వాన్ని స్మరించుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకునే ఈ జాతర గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది.