అలస్కాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం…
అలస్కా భూకంపం నేపథ్యంలో సునామీ అడ్వైజరీ అమలు;
అలస్కా తీర ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో సంభవించిన ఈ ప్రకంపనలతో తీర ప్రాంతాల్లో ప్రజలు భయంతో పరుగులు తీశారు. భారత కాలమానం ప్రకారం తెల్లవారు జామున 2:07 గంటలకు ఈ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, శాండ్ పాయింట్ అనే ప్రాంతం ఈ భూకంపానికి కేంద్రబిందువుగా గుర్తించారు. ఇది అలస్కా వాయువ్య పోపోఫ్ ద్వీపంలో యాంకరేజ్‌కు సుమారు 600 మైళ్ల దూరంలో ఉన్న పర్యాటక ప్రదేశం.
ఈ భూకంపం 36 కిలోమీటర్ల లోతులో, టెక్టోనిక్ ప్లేట్స్ కదలికల వల్ల సంభవించిన షాలో భూకంపంగా గుర్తించారు. షాలో భూకంపాల వల్ల ఎక్కువ శక్తి ఉపరితలానికి దగ్గరగా విడుదలై భారీ విధ్వంసం సంభవించే ప్రమాదం ఉంటుంది.
భూకంపం సంభవించిన వెంటనే అలస్కా తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగసిపడ్డాయి. సముద్రం ఉప్పొంగడంతో నేషనల్ వెదర్ సర్వీస్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే, తర్వాత ఆ హెచ్చరికను సునామీ అడ్వైజరీగా తగ్గించారు. అయినప్పటికీ, అలస్కాలోని శాండ్ పాయింట్, కోల్డ్ బే, కొడియాక్ వంటి నగరాల్లో అప్రమత్తత పెరిగింది.
ప్రభుత్వ అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయిస్తూ ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. కొడియాక్ పోలీసులు ప్రజలను అలర్ట్ చేసి, సైరన్ మోగించారు. అక్కడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొడియాక్ నగరానికి ఎటువంటి నష్టం జరగలేదని సమాచారం. కోల్డ్ బే సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉండటంతో సునామీ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఈ ఘటన రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలోని భూభాగంలో జరిగిందని గుర్తించవచ్చు. ఇది ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు, అగ్నిపర్వతాలు సంభవించే భూభాగం. అమెరికా, జపాన్, ఇండోనేషియా, చిలీ, మెక్సికో వంటి దేశాలు ఈ పరిధిలో ఉంటాయి. అలస్కాలో తరచూ భూకంపాలు సంభవించడం దీనికి ఉదాహరణ.
ఈ భూకంపం వల్ల మరోసారి మనుషుల బలం మేధస్సు ముందు ప్రకృతిశక్తి నుంచి కూడా మనం కాపాడుకోగలం అని చాటిచెప్పింది. అయితే, అధికారులు వేగంగా స్పందించడం వల్ల ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారు. భూకంపాలు తరచూ సంభవించే ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం.