రాష్ట్రవ్యాప్తంగా మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు
గిరిజన హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధునికి ఘన నివాళి;
ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు రాష్ట్రం అంతా ఘనంగా నిర్వహించారు,1897 జూలై 4న, విశాఖపట్నం జిల్లా పండ్రంగి గ్రామంలో జన్మించిన అల్లూరి సీతారామరాజు గారు చిన్ననాటినుంచే ధైర్యానికి, న్యాయానికి ప్రతిరూపంగా ఎదిగారు. అన్యాయాన్ని తట్టుకోలేని మానసిక శక్తి, తన చుట్టూ ఉన్న గిరిజన సమాజాన్ని ప్రేమించే మనస్సు ఆయనకు ఉన్న గొప్ప లక్షణాలు.
ఆయన బ్రిటిష్ వారి దోపిడిని తన కళ్లతో చూశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలు, అవమానాలు చూసి కలత చెందిన ఆయన, దేశ స్వాతంత్ర్య సమరానికి తన జీవితాన్ని అంకితం చేశారు. విద్యార్హత ఉన్నా, హోదాలు కలిగి ఉండాలనే ఆశ లేకుండా, ప్రజల హక్కుల కోసం,దేశ స్వాతంత్ర్యం కోసం ఆయుధంతో కూడిన పోరాటాన్ని ఎంచుకున్నారు.
1922 నుంచి 1924 వరకూ జరిగిన రంపా తిరుగుబాటుకు అల్లూరి నాయకత్వం వహించారు. ఆయుధాలు లేని గిరిజనులకు ధైర్యాన్ని నింపారు. బ్రిటిష్ ఆయుధాలను దాడులు చేసి లాక్కొని గిరిజనులకు అందించారు. ఆయన పోరాట వ్యూహాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తీవ్ర కలవరానికి గురిచేశాయి. ఓ ఉద్యమ నాయకుడిగా కాదు, ఓ సైనిక ప్రణాళికకర్తగా, ప్రజల నాయకుడిగా, త్యాగమూర్తిగా అల్లూరి చరిత్రలో నిలిచిపోయారు.
1924లో బ్రిటిష్ వారు కుట్రపూరితంగా అల్లూరిని పట్టుకొని విచక్షణారహితంగా హత్య చేశారు. కానీ అల్లూరి మరణం ఆయన ఆత్మగౌరవం, ధైర్యం, దేశభక్తిని ఎక్కడా తగ్గించలేదు. అది చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఆయన చేసిన త్యాగం, పోరాటం భారత స్వాతంత్ర్య గాధలో శాశ్వతంగా నిలిచిపోయింది.
అల్లూరి కేవలం ఓ యోధుడు కాదు – ఆయన ఓ ఋషితుల్య వ్యక్తి. గిరిజనులకు వైద్యం చేసిన వైద్యుడిగా, రామాయణం-మహాభారతం వంటి ఇతిహాసాల గాథలు చెప్పి వారి మనోబలాన్ని పెంచిన జ్ఞానవేత్తగా నిలిచారు. తాను చదివింది, నేర్చుకున్నది ప్రజల కోసం,దేశకోసం వినియోగించారు. నిస్వార్థమైన సేవ, నిబద్ధత, దేశానికి అంకితభావం ఆయనను మహానుభావుడిగా మార్చాయి.
ఈ నేపథ్యాన్ని గుర్తు చేస్తూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఎంతో ప్రేరణాత్మకంగా నిలిచాయి.అల్లూరి ఆశయాలు, ఆయన పథం ఇవే మనకు దారి చూపే దీపాలు. మన్యం వీరుని జీవితం యువతలో శక్తిని, దేశభక్తిని రగిలించే నక్షత్రంగా ఎప్పటికీ మెరవాలి అన్నారు.