మహా లక్ష్మి విజయగాథ: 200 కోట్ల ఉచిత ప్రయాణాలు!
మహిళా సాధికారత, ప్రజా పాలన వైపు తెలంగాణ మైలురాయి - జూలై 23న అన్ని డిపోలలో ప్రత్యేక వేడుకలు - ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు సత్కారం;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహా లక్ష్మి పథకం అత్యంత ప్రతిభావంతంగా కొనసాగుతోంది. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం కింద ఇప్పటివరకు రాష్ట్రంలోని మహిళలు 200 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు చేసినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది రాష్ట్ర ప్రజా రవాణా చరిత్రలో ఓ మైలురాయి కావడమే కాక, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది తొలి పెద్ద విజయం. ఈ ఘనతను పురస్కరించుకుని జూలై 23 బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 97 ఆర్టీసీ డిపోలు మరియు 341 ప్రధాన బస్ స్టేషన్లలో ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.
ఈ పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.6,700 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. ఈ పథకం వల్ల విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, వ్యాపారవేత్తలు, రోజువారీ కూలీలు వంటి అనేక రంగాల్లోని మహిళలకు ప్రయోజనం లభించింది. ప్రతి నెలా సగటున రూ.4,000 నుంచి రూ.5,000 వరకు మహిళలు ఆదా చేసుకుంటున్నారు. ప్రజా రవాణా వినియోగం గణనీయంగా పెరగడంతో కొత్త బస్సులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ — మహా లక్ష్మి పథకం విజయవంతంగా అమలు కావడానికి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు మరియు ఇతర సిబ్బంది అంకితభావంతో పనిచేసారని తెలిపారు. ప్రయాణికుల భద్రత, ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వం, సేవల నాణ్యత విషయంలో ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
జూలై 23న జరిగే వేడుకల్లో భాగంగా అన్ని డిపోలు, బస్టాండ్లను ప్రత్యేకంగా అలంకరించి, బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో సమావేశాలు జరుగనున్నాయి.
పథకం ద్వారా లాభం పొందిన మహిళల వ్యక్తిగత అనుభవాలను వినిపించనున్నారు. ఉత్తమ మహిళా ప్రయాణికులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలతో సత్కరించనున్నారు. అలాగే పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల మధ్య మహిళా సాధికారతపై వ్యాసరచన, రంగవల్లి, చిత్రలేఖన పోటీలను నిర్వహించనున్నారు. ప్రతి డిపో నుండి ఉత్తమంగా పని చేసిన ఐదుగురు డ్రైవర్లు, ఐదుగురు కండక్టర్లు మరియు ఇతర సిబ్బందిని గుర్తించి సత్కరించనున్నారు.
ఈ సఫలం కేవలం రవాణా రంగానికే పరిమితం కాకుండా, తెలంగాణ రాష్ట్రం మహిళా సాధికారత, సమానత్వం మరియు ప్రజల సంక్షేమాన్ని ప్రధానంగా చూస్తున్న పాలన దిశగా ముందడుగు వేసినట్టే. ఇది ప్రజాకేంద్ర పాలనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.