బీసీలకు న్యాయం – 42% రిజర్వేషన్‌కి తెలంగాణ కేబినెట్ మంజూరు

సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు: కేబినెట్ సమావేశంలో చర్చ;

Update: 2025-07-11 04:38 GMT

నిన్న జరిగిన తెలంగాణ కాబినెట్ మీటింగ్ లో పలు కీలక అంశాలకు కాబినెట్ ఆమోదం తెలిపింది.తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రాభివృద్ధి, న్యాయబద్ధమైన ప్రతినిధిత్వం, పరిపాలనా సంస్కరణల దిశగా ఈ నిర్ణయాలు ప్రభావవంతమవుతాయని అంచనా.

బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు త్వరలోనే ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముందని సమాచారం. దీంతోపాటు, అసెంబ్లీ ప్రొరోగ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.

గ్రామీణ పరిపాలన వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుల వల్ల గ్రామీణ పాలనలో పారదర్శకత, సమర్థత పెరిగే అవకాశం ఉంది.

హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సిన నేపథ్యంలో, ఈ అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. సమావేశం అనంతరం అధికారికంగా ఎన్నికల ప్రకటన చేసే అవకాశం ఉంది.

వర్షాకాలం ప్రారంభం కావడంతో వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు సహాయక చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేబినెట్, సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాలని ఆదేశించింది. ఇప్పటికే తీసుకున్న చర్యల అమలుపై సమీక్ష కూడా జరిగింది.

Tags:    

Similar News