ఏపీ గవర్నర్ తో జగన్ దంపతుల భేటీ

రూ. 3,500 కోట్ల లిక్కర్ స్కాం కేసుతో జగన్ లో పెరుగుతున్న ఆందోళన;

Update: 2025-07-29 14:34 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన రూ. 3,500 కోట్ల విలువైన లిక్కర్ స్కాం కేసు రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ కేసులో ఇప్పటికే వైఎస్సార్సీపీకి చెందిన పలు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. వీరిలో రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి సహా మరికొంతమంది ఉన్నారు. తాజా ఎస్‌ఐటి ఛార్జ్‌షీట్‌లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది.

ఈ ఛార్జ్‌షీట్ ప్రకారం, 2019 నుంచి 2024 వరకు జరిగిన లిక్కర్ వ్యాపారంలో జరిగిన అవినీతికి జగన్ ప్రత్యక్ష లబ్దిదారుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు. జగన్‌కి నెలకు సగటున రూ. 50 నుంచి 60 కోట్ల వరకు నగదు లావాదేవీలు జరిగాయి అని సిట్ అధికారులు తెలిపారు.అయితే ఆయనను ఇప్పటివరకు నేరుగా నిందితుడిగా నమోదు చేయలేదు.

ఈ కేసు విచారణ ఊపందుకుంటున్న సమయంలో జగన్ తాడేపల్లి నుంచి నేరుగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలుసుకోవడానికి రాజ్ భవన్‌కి వెళ్లడం రాజకీయంగా చర్చనంశంగా మారింది. ఆశ్చర్యకరంగా, ఆయనతో పాటు భార్య వైఎస్ భారతి కూడా వెళ్లడం గమనార్హం. ఈ భేటీలో జగన్ పార్టీ నేతల అరెస్టులపై ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

వైఎస్సార్సీపీ వర్గాలు ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్న కుట్రగా పేర్కొంటున్నాయి. శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న పార్టీకి ఇబ్బందులు కలిగించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే అధికార పక్షం మాత్రం, ఈ కేసు పూర్తి ఆధారాలపై నడుస్తోంది అని చెప్పుతోంది.

జగన్‌పై నేరుగా కేసు నమోదు చేయలేదు కానీ, పేరును చార్జ్‌షీట్‌లో ప్రస్తావించడం వల్ల ఆయనపై దర్యాప్తు తీవ్రం కావచ్చు. త్వరలోనే ఆయనకు నోటీసులు రావడం, విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమంది విశ్లేషకుల ప్రకారం, అరెస్టు అవకాశం పూర్తిగా కొట్టిపారేయలేము అని చర్చించుకుంటున్నారు.

వైఎస్సార్సీపీ ఇప్పటికే ఈ కేసును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. అవసరమైతే కేంద్రానికి వెళ్లి గవర్నర్, ఇతర అధికారుల సహాయం తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే యోచనలో వైసీపీ అధ్యక్షుడు ఉన్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News