మధురవాడ బటర్‌ఫ్లై పార్క్ భూమి మార్పిడికి హైకోర్టు స్టే

ప్రైవేట్ అవసరాల కోసం పార్క్ భూముల వినియోగం వద్దు: హైకోర్టు ధర్మాసనం;

Update: 2025-07-09 09:05 GMT

విశాఖపట్నం మధురవాడలో ఉన్న జీవీఎంసీ బటర్‌ఫ్లై పార్క్ స్థల భూమి మార్పిడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో జారీ చేసిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే విధించింది.

జనసేన పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై, ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ శ్రీ దీరాజ్ సింగ్ ఠాకూర్ గారు మరియు న్యాయమూర్తి చీమలపాటి రవి గారు ధర్మాసనం విచారణ జరిపింది.

వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం ఆమోదించిన ఖాళీ స్థలాలను ఉద్యానవనాలు, ఆట మైదానాలు, కమ్యూనిటీ హాలులు వంటి ప్రజా అవసరాలకే వినియోగించాలి అని స్పష్టం చేస్తూ, ప్రైవేట్ అవసరాల కోసం వినియోగించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

మధురవాడ ఎంఎస్‌ఆర్ లేఅవుట్‌లో ఉన్న బటర్‌ఫ్లై పార్క్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు శ్రీ పిల్లా లక్ష్మణ పాత్రుడు & శ్రీ పోతిన అప్పారావు తమ స్థలంగా మార్పిడి చేసుకోవాలంటూ మళ్లీ ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో ఆమోద ఉత్తర్వులు (G.O.) జారీ చేయడం జరిగింది. అయితే, గతంలో ఇదే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అనీల్ కుమార్ సింఘాల్ 2023 సెప్టెంబర్‌లో ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, లేఅవుట్‌లలో రిజర్వు చేయబడిన బహిరంగ స్థలాలను వాణిజ్య అవసరాల కోసం వినియోగించరాదని, ప్రత్యామ్నాయ స్థలాల మార్పిడికి అనుమతి ఇవ్వరాదని స్పష్టంగా పేర్కొన్నారు.

ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల తీర్పుల్లో పబ్లిక్ యూజ్‌కు రిజర్వు చేయబడిన భూములను ఇతర అవసరాలకు వినియోగించరాదని స్పష్టంగా ఆదేశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన స్టేతో జీవీఎంసీ బటర్‌ఫ్లై పార్క్ భూమి భవిష్యత్తుపై స్పష్టత ఏర్పడింది. ప్రభుత్వ ఉత్తర్వులను నిలిపివేసిన ఈ తీర్పు, ప్రజా ప్రయోజనాలకు మద్దతుగా నిలిచిందని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News