హైదరాబాద్ వాసులకు పోలీసుల హెచ్చరిక
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం కారణంగా మధ్యాహ్నం తర్వాత వర్షం ముప్పు మలక్‌పేట్, సైదాబాద్ ప్రాంతాలకు ప్రత్యేక హెచ్చరిక;
హైదరాబాద్‌లో వాతావరణం మళ్లీ మారింది.వాతావరణ శాఖ ముందుగా హెచ్చరించినట్టుగా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కవగా ఉండటంలో అధికారులు అప్రమత్తం అయ్యారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ విపత్కర పరిస్థితులలో హైదరాబాద్ పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. ఈ కారణంగా నగరంలోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.మధ్యాహ్నం 3 గంటలలోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలని, ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని పోలీసు అధికారులు చెప్పారు. ట్రాఫిక్ సమస్యలు, వరదల ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున అవసరం లేకుండా బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ప్రత్యేకంగా మలక్‌పేట్, సైదాబాద్, చాంద్రాయణగుట్ట, శాలిబాండ, మీరాలమ్ వన్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో నీరు చేరే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.ప్రజలు సహకరిస్తేనే ఈ వర్షాల వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించగలమని పోలీసులు అన్నారు. భద్రత కోసం అందరూ తమ పరిసరాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.