షర్మిలకు గుడ్‌బై, కొత్త సారధి ఎవరూ?

షర్మిల పనితీరుపై ఢిల్లీ నేతల అసంతృప్తి, మార్పుకు రంగం సిద్ధం - రాష్ట్ర పీసీసీ పగ్గాలు మరో మహిళా నేత చేతికి వెళ్లే అవకాశం;

Update: 2025-08-03 15:15 GMT

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో మరో ముఖ్యమైన మార్పు దిశగా పరిణామాలు జరుగుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య 2024 జనవరిలో షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించిన పార్టీ అధినాయకత్వం, ఇప్పుడు ఆ స్థానంలో మార్పు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీ బలోపేతం దిశగా ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఢిల్లీ నేతలు భావిస్తున్నారని చెప్పబడుతోంది.

రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పైన కంటే, తన అన్న జగన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టి రాజకీయ పోరాటం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఢిల్లీకి చేరాయి. ముఖ్యంగా విజయవాడకు చెందిన కొంతమంది నేతలు నేరుగా రాహుల్ గాంధీ కార్యాలయానికే వెళ్లి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు, ఛాలెంజ్‌లు మినహా, పార్టీ కోసం ప్రణాళికాబద్ధంగా, నిర్మాణాత్మకంగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

రాష్ట్ర కాంగ్రెస్‌లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ, వారిని సమన్వయం చేయడంలో షర్మిల విఫలమయ్యారని భావన బలపడింది. దీంతో, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి షర్మిలను తప్పించి, మరో మహిళా నేతకు పగ్గాలు అప్పగించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో, ఉత్తరాంధ్రకు చెందిన బీసీ వర్గానికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ కూడా ఉత్తరాంధ్ర బీసీ నేతకే రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన విషయం గమనార్హం. కాంగ్రెస్‌లో ఈ పదవికి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి పేరు బలంగా వినిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆమె వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చి, 2009లో ఎంపీగా గెలిచి కేంద్రంలో సహాయ మంత్రిగా పనిచేశారు. 2019కు ముందు వైసీపీలో చేరినా, అక్కడ అవకాశాలు రాక మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ఇటీవల ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలిసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినా, షర్మిలకు పార్టీ జాతీయ కార్యదర్శి హోదా ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పీసీసీ కొత్త చీఫ్ ఎవరు అనే దానిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. దీంతో, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో కొత్త సారథి ఎవరన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరిగిపోతోంది.

Tags:    

Similar News