ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఫ్లైట్‌కు గాల్లో సమస్య
గాల్లో ఇంజిన్ ఫెయిల్ - 191 మంది ప్రాణాలు సురక్షితంగా బయటపడిన ఘటన;
ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానం ప్రయాణదారులకు ఒక క్షణం కలవరాన్ని కలిగించింది. గాల్లో ప్రయాణిస్తుండగా విమానానికి సాంకేతిక లోపం ఏర్పడటంతో ముంబై ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..నిన్న రాత్రి ఇండిగోకు చెందిన 6E-6271 నెంబర్ ఫ్లైట్ జూలై 16 వ తేదీన ఢిల్లీ నుంచి గోవా వైపు బయలుదేరింది. అయితే గాల్లో ఉన్న సమయంలో ఫ్లైట్ ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. పైలట్లు వెంటనే అప్రమత్తమై అంతర్జాతీయంగా ఉపయోగించే అత్యవసర సంకేతం “PAN PAN PAN” ను బేస్ కంట్రోల్‌కు పంపించారు. ఈ సంకేతం జీవనహాని లేదని, కానీ అత్యవసర పరిస్థితి ఉందని సూచించేందుకు ఉపయోగిస్తారు.దీంతో పైలట్ అప్రమత్తమై ముంబై ఎయిర్‌పోర్ట్‌తో సంప్రదించి అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి తీసుకున్నాడు.
రాత్రి 9:32 గంటల సమయంలో ముంబైకి దారిమార్చేందుకు పైలట్‌లు అనుమతి కోరగా, విమానం సురక్షితంగా 9:53 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవడం ద్వారా పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడకుండా ఉండడం శుభపరిణామంగా పేర్కొనవచ్చు. విమానంలో 191 మంది ప్రయాణికులు ఒకింత భయభ్రాంతులకు లోనయ్యారు కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై స్పందిస్తూ – "ఇంజిన్ సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే మా పైలట్లు అన్ని భద్రతా నిబంధనలను పాటించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల భద్రత మా ప్రథమ ప్రాధాన్యత," అని తెలిపింది.
ప్రస్తుతం విమానాన్ని పరిశీలన నిమిత్తం గ్రౌండ్ మెకానిక్స్ పరిశీలిస్తున్నారు. ప్రయాణికులను తదుపరి ఫ్లైట్ ద్వారా గమ్యస్థానానికి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.