అమెరికాలో ఘోర ప్రమాదం: హైదరాబాద్ కుటుంబం సజీవదహనం
రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్ ఢీకొనడంతో తెలుగు కుటుంబం మంటల్లో సజీవదహనం;
అమెరికాలో డల్లాస్ నగరంలో నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందారు. తేజస్విని, శ్రీ వెంకట్ దంపతులు మరియు వారి ఇద్దరు చిన్నారులు—మొత్తం నలుగురు ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే... వెంకట్ కుటుంబం అట్లాంటాలో నివసించే బంధువుల వద్ద సెలవులను గడిపేందుకు కారులో అక్కడికి వెళ్లారు. సెలవులు ముగిసిన తరువాత, వారం రోజుల తర్వాత, మళ్లీ డల్లాస్‌కి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
అర్థరాత్రి సమయంలో, గ్రీన్ కౌంటీ పరిధిలోని హైవేపై ఎదురుగా వస్తున్న మినీ ట్రక్, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ట్రక్ రాంగ్ రూట్‌లో దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న నలుగురు ఆ కుటుంబ సభ్యులు సజీవదహనం అయ్యారు.
ప్రమాదం తీవ్రతతో కారు పూర్తిగా బూడిదగా మారిపోయింది. మృతదేహాల గుర్తింపు కోసం పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షల కోసం ఎముకలను పంపించారు. డిఎన్ఏ నమూనాలు తీసుకున్న అనంతరం, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తను విని వెంకట్, తేజస్విని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అమాయక చిన్నారులతో సహా- సజీవ దహనం కావడంతో, తెలుగు సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.