కొండాపూర్‌లో పేలుడు, స్కూల్ విద్యార్థులకు గాయాలు

పక్కనే నిర్మాణ ప్రాజెక్టులో భారీ శబ్దం... భయాందోళనకు గురైన చిన్నారులు;

Update: 2025-08-05 14:49 GMT

హైదరాబాద్‌ కొండాపూర్‌లో ఉన్న నమిశ్రీ గ్రూప్ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. పేలుళ్ల శబ్దం అంతటా మారుమోగింది. ప్రాజెక్ట్‌ పక్కనే ఉన్న చిరెక్ స్కూల్ భవనం కూడా ఈ పేలుడు వల్ల ప్రకంపించడంతో, తరగతుల్లో ఉన్న విద్యార్థులంతా భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటనలో కొంతమంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వెంటనే స్కూల్ యాజమాన్యం స్పందించి, గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించింది.

స్కూల్ యాజమాన్యం నిర్మాణ ప్రాజెక్టు నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రమాదకరమైన రీతిలో పేలుళ్లు నిర్వహించడం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లిందని ఆరోపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో స్కూల్ ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు ఓ లేఖ రాస్తూ, విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి ప్రమాదం లేదని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ప్రస్తుతానికి విద్యార్థులంతా సురక్షితంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. అయితే నివాస ప్రాంతాల మధ్యలో నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్ వాడటం ఎంతవరకు సమంజసం అన్న దానిపై ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News