నిబంధనలు ఉల్లంఘించిన ఇంగ్లాండ్ బౌలర్
స్పైక్స్‌తో బంతిని నలిపిన బ్రైడన్ కార్స్ – ఇంగ్లాండ్ ఆటగాడిపై విమర్శల వర్షం;
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో బౌలర్ బ్రైడన్ కార్స్ చేసిన చర్యపై క్రికెట్ ప్రపంచం దృష్టి సారించింది. మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ సమయంలో బంతిని తన స్పైక్స్ ఉన్న షూతో నలిపినట్లు కనిపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో బయటపడిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆట స్వభావానికి విరుద్ధమని, నైతిక విలువలను తక్కువ చేసే చర్యగా చెబుతున్నారు.
బంతిని ఉద్దేశపూర్వకంగా గాయపర్చడం స్పష్టంగా ఐసీసీ నిబంధనలకు వ్యతిరేకం. ఇలాంటి చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఐసీసీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడం క్రీడాప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. అనేక మంది విశ్లేషకులు దీన్ని సూటిగా నిబంధనలను ఉల్లంగిచటమే అని క్రికెట్ అభిమానుల అభిప్రాయం.
ఇంగ్లాండ్ జట్టు తరచూ ఇతర దేశాల ఆటగాళ్ల ప్రవర్తనపై విమర్శలు చేస్తూ కనిపిస్తుంది. కానీ తాము చేసిన తప్పులను గమనించకపోవడం ఆ జట్టు ద్వంద్వ ధోరణిని చూపిస్తున్నదని పలువురు విమర్శిస్తున్నారు. ఇదే సందర్భంలో, కొన్ని దేశాలకు ఒక నిబంధన, కొన్ని దేశాలకు మరో నిబంధన అనేలా ఐసీసీ వ్యవహరిస్తోందని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంగ్లాండ్ జట్టు తరచూ ఇతర జట్లను "మోరల్ పోలీసింగ్" చేస్తూ ప్రవర్తిస్తుంటుంది. కానీ తమ జట్టులో జరిగిన ఈ స్పష్టమైన తప్పిదాన్ని సమర్థించుకోవడం లేదా పట్టించుకోకపోవడం వారి నైతిక స్థాయిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆట లోని నిజాయితీ కాపాడాలంటే ఈ అంశంపై వెంటనే చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది.
బ్రైడన్ కార్స్ చేసిన చర్యలు ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటే, అతనిపై ఐసీసీ తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆట నైతికతపై ఉన్న విశ్వాసం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఒక్క ఆటగాడి తప్పే కాదు, అంతర్జాతీయ క్రికెట్‌ను నడిపించే వ్యవస్థ మీదే ప్రశ్నలు లేవనెత్తే అంశం.