దేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు
హెరిటేజ్ ఫుడ్స్ షేర్లే చంద్రబాబు ఆస్తుల ప్రధాన మూలం - మొత్తం 30 మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,632 కోట్లు;
ADR (Association for Democratic Reforms) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, దేశంలోనే అత్యధిక ఆస్తులు కలిగిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఆయన వద్ద ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ రూ.931 కోట్లు,అప్పులు రూ.10 కోట్లు ఉన్నట్లు వెల్లడి చేసింది. ఇందులో పెద్ద భాగం ఆయన కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ షేర్లు ద్వారా వచ్చిన సంపద. భార్య భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి పేర్లలో ఉన్న షేర్లే ఆయన ఆస్తుల్లో ప్రధాన భాగం.
చంద్రబాబు తరువాత స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ఉన్నారు. ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ.332 కోట్లు. దీని వలన దేశంలో రెండో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా నిలిచారు.రూ.30 కోట్ల ఆస్తులతో రేవంత్ రెడ్డి ఎడో స్థానంలో ఉన్నారు. అలాగే అత్యంత తక్కువ ఆస్తులు ఉన్న CMగా మమతా బెనర్జీ నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ.15 లక్షలు మాత్రమే.
ADR నివేదిక ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ మొత్తంగా రూ.1,632 కోట్లు. అంటే ఒక్కో ముఖ్యమంత్రికి సగటు ఆస్తి విలువ సుమారు రూ.54 కోట్లుగా ఉంది. ఇది దేశ రాజకీయ నాయకుల ఆర్థిక స్థితిని స్పష్టంగా చూపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అత్యల్ప ఆస్తులు కలిగిన నాయకురాలిగా గుర్తించబడ్డారు. ఆమె వద్ద ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ.15 లక్షలు మాత్రమే. ముఖ్యంగా ఆమెకు ఎలాంటి స్థిరాస్తి (ఇల్లు, భూమి వంటివి) లేవు. ఇది ఇతర ముఖ్యమంత్రులతో పోల్చితే చాలా తక్కువ.
ఈ నివేదికలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో 12 మందికి (సుమారు 40%) నేర సంబంధిత కేసులు ఉన్నాయి. అందులో ఎక్కువ కేసులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైనట్లు పేర్కొన్నారు. ఆయన తరువాత MK స్టాలిన్ (తమిళనాడు), చంద్రబాబు నాయుడు (ఆంధ్రప్రదేశ్) వంటి ముఖ్యమంత్రులపై కూడా కొన్ని కేసులు ఉన్నట్లు వివరించారు.
ఈ వివరాలు ప్రజలకు ముఖ్యమంత్రుల ఆస్తులు, వారి ఆర్థిక స్థితి గురించి స్పష్టత ఇస్తున్నాయి. ఒకవైపు కోట్లు, వందల కోట్లు సంపద కలిగిన ముఖ్యమంత్రులు ఉండగా, మరోవైపు లక్షల్లో మాత్రమే ఆస్తులు కలిగిన మమతా బెనర్జీ వంటి నాయకురాలు కూడా ఉన్నారు. ఇది దేశ రాజకీయ నాయకుల ఆస్తుల అసమానతను స్పష్టంగా చూపించే అంశం.