అదిలాబాద్ జిల్లాలో బస్సు ప్రమాదం – 25 మందికి గాయాలు
వేగం లేదా నిద్ర మత్తే కారణమా? పోలీసులు దర్యాప్తు ప్రారంభం;
అదిలాబాద్ జిల్లా గూడిహత్నూర్ మండల పరిధిలో అర్థరాత్రి దారుణమైన రోడ్డుప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ వోల్వో బస్సు, గూడిహత్నూర్ సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కకు తూర్పు తిరుగుతూ పల్టీ కొట్టింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ సంఘటనలో 25 మందికి గాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స కోసం అదిలాబాద్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు.
ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియరాలేదు కానీ, డ్రైవర్‌కు నిద్ర మత్తు లేదా వాహన వేగం అధికంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన సమయంలో రాత్రి సమయంలో వర్షం కూడా పడుతుండటం వల్ల రోడ్డుపై జారుదల ఏర్పడిన అవకాశముందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రయాణికుల ప్రాణాలు రక్షించేందుకు సహాయంగా స్పందించిన స్థానికులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.