నకిలీ మద్యం ముఠాపై ఏపీ ఎక్సైజ్ శాఖ మెగా దాడులు

ఆంధ్రప్రదేశ్‌లో 36 మంది అరెస్ట్ – 2,200 లీటర్ల స్పిరిట్ స్వాధీనం - నకిలీ లేబుళ్లు, ఖాళీ బాటిళ్లు, సీలింగ్ యంత్రాలు పట్టివేత;

Update: 2025-07-22 14:54 GMT

ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ చేపట్టిన ప్రత్యేక దాడులు ఘనవిజయం సాధించాయి. ఆధునిక నిఘా వ్యవస్థ, డేటా విశ్లేషణ ఆధారంగా అమలు చేసిన చర్యలతో 36 మంది నిందితులను అరెస్ట్ చేయడం తో పాటు, 2,232 లీటర్లకు పైగా అక్రమ స్పిరిట్, నకిలీ మద్యం బాటిళ్లు, లేబుళ్లు, ప్యాకింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వం ప్రధానంగా ప్రజారోగ్యం మరియు నాణ్యమైన మద్యం సరఫరాపై దృష్టి సారించగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే నకిలీ మద్యం నిర్మూలనపై కఠిన చర్యలు తీసుకోవాలని పునఃపునః ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ మీనా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ముమ్మరంగా దాడులు నిర్వహించారు.

జూన్ 23 నుంచి జూలై 22 వరకు కోరింగిపాలెం, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో క్షుణ్ణమైన నిఘా ఆధారంగా దాడులు జరిగాయి. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించే ఖాళీ బాటిళ్లు, సీలింగ్ యంత్రాలు, మిషన్లు, లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. స్పిరిట్ వినియోగంలో అనుమానాస్పద మార్పులను గుర్తించడమే ఈ దాడులకు దారితీసింది.

ఈ అక్రమ కార్యకలాపాలకు తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లాలోని కృష్ణ ఫార్మా అనే కంపెనీ ప్రధాన కేంద్రంగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. కరోనా మహమ్మారి సమయంలో తాత్కాలికంగా పొందిన అనుమతిని దుర్వినియోగం చేస్తూ, డెనేచర్ చేయని స్పిరిట్‌ను హ్యాండ్ రబ్ పేరుతో నేరుగా నకిలీ మద్యం తయారీదారులకు సరఫరా చేసినట్లు తేలింది. కంపెనీ యజమాని మల్లికార్జున రావు నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు రుత్తల శ్రీనివాస్ అలియాస్ అబ్దుల్ కలాం, చరణ్జీత్ సింగ్ సెథీలకు స్పిరిట్ పంపినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అందించిన సమాచారంతో స్పందించిన తెలంగాణ ఎక్సైజ్ అధికారులు జూలై 21న సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో దాడులు నిర్వహించి, 800 లీటర్ల స్పిరిట్, నకిలీ లేబుళ్లు, ఖాళీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి నుంచి తెచ్చిన ఖాళీ బాటిళ్లు, బ్రాండ్ స్టిక్కర్లు నిందితుల వద్ద ఉండటం గమనార్హం.

డెనేచర్ చేయని స్పిరిట్‌ను మద్యం తయారీలో వాడడం వల్ల ప్రజారోగ్యానికి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, "ఆధునిక నిఘా వ్యవస్థను బలోపేతం చేసి, డేటా ఆధారంగా దాడులు నిర్వహించిన కారణంగా ఈ ముఠాను ఛేదించగలిగాం" అన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ మాట్లాడుతూ, ప్రతి నిందితుడిని గుర్తించి శిక్షించే దిశగా శాఖ పూర్తి స్థాయిలో కృషి చేస్తోంది అని తెలిపారు.

తదుపరి చర్యలు

కృష్ణ ఫార్మా లైసెన్సు రద్దు చేయాలని ఏపీ ఎక్సైజ్ శాఖ, తెలంగాణ అధికారులను కోరనుంది. అంతర్రాష్ట్ర సమన్వయంతో మిగిలిన నిందితులను గుర్తించి, శిక్షించే ప్రక్రియ కొనసాగుతోంది. నకిలీ మద్యం నిర్మూలన దిశగా ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటోంది.


Tags:    

Similar News