ప్రసన్నకుమార్ రెడ్డి మాటలు మహిళల పరువుకు మచ్చ – అనిత ఆగ్రహం

జగన్ ఓ నాయకుడా? మహిళల అవమానం చూసి కూడా మౌనమా? – హోంమంత్రి మండిపాటు;

Update: 2025-07-08 12:16 GMT

హోంమంత్రి వంగలపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళల పరువును కించపరిచే విధంగా మాట్లాడిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ ఇంట్లో మహిళలపై ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు సహిస్తారా? అని విరుచుకుపడ్డారు. మహిళల గురించి నీచమైన పదజాలంతో మాట్లాడినా మాజీ ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉండడం దారుణమని, అలాంటి వ్యాఖ్యలకు అండగా వ్యవహరించడం మరింత జుగుప్సాకరమని అన్నారు వనిత.తల్లి, చెల్లి, కుమార్తె గురించి అవమానకరంగా మాట్లాడినప్పుడు ఆపలేని నేత ఎలా నాయకుడు కావచ్చు? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా వ్యాఖ్యానించడం పూర్తిగా తప్పని స్పష్టం చేశారు హోం మినిస్టర్.

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరులో జరిగిన నారీ సంకల్ప దీక్ష సందర్భంలో ఇదే ప్రసన్నకుమార్ రెడ్డి తనపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మహిళా సమాజం మొత్తం ఉలిక్కిపడిందని అన్నారు.ఆయన చేసిన వ్యాఖ్యలను తన తల్లి, భార్య, కుమార్తెకు వినిపించండి, వాళ్లు సంతోషంగా ఆమోదిస్తారా? అని ఎదురు ప్రశ్న చేశారు. మహిళల వ్యక్తిత్వని అవహేళనగా మాట్లాడటం వైసీపీ డిఎన్‌ఎలో భాగమైపోయిందని విమర్శించారు అనిత.

గతంలో సకలశాఖల మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి “సంకరజాతి” అంటూ మహిళలను కించపరిచినట్లు మాట్లాడటం గుర్తు చేశారు.పత్రికా విలేకరిగా వ్యవహరిస్తున్న కృష్ణంరాజు సాక్షి టీవీలో “అమరావతి వేశ్యల రాజధాని” అని మాట్లాడడం శోచనీయం అని అభిప్రాయపడ్డారు. అమరావతి మహిళలపై సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.జగన్ రెడ్డి తన సొంత చెల్లి వైఎస్ షర్మిల గురించి కూడా తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించిన వ్యక్తి అని వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News